1/26/2015

మోడీతో మా పేటకొచ్చిన ఒబామా!

భారత ప్రధాని మోడీ ఏదో చెబుతుంటే యుఎస్ ప్రెసిడెంట్ ఒబామా నవ్వుతూ వింటున్నాడు కదా. ఇవాళ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా మోడీ, ఒబామా మా పేటలోని ఓ స్కూల్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పిల్లల మధ్య ఇలా కనిపించారు. ఉత్తినే వాళ్ళ వేషాలేసిన పదో తరగతి పిల్లలు ఇలా జీవించేశారు. ఇద్దర్ని చూసి ముచ్చటపడి వాళ్ళ ఫోటోను మీతో పంచుకుంటున్నాను. ఆ సమయంలో టిపికల్ జర్నలిస్టుకుండే ఆలోచనలు నాకు వచ్చాయి. స్కూల్ ప్రిన్సిపాల్‌ను, వాళ్ళ పేరేంట్స్‌ను బతిమిలాడుకుని నాతో పాటు ఓ అరగంట వాళ్ళను రోడ్డు మీదకు తీసుకెళ్దామనుకున్నా.

మోడీ, ఒబామాలను మా పేటలోని సిటీ బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేయిద్దామని.. కిటకిటలాడుతూ బస్సు వస్తే వాళ్లతో ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేయిద్దామని.. ఆర్రూపాయల టికెట్టు కోసం కండక్టర్‌కు పది రూపాయల నోటిచ్చేలా చేసి "అరే దస్ నోట్ ఇస్తే చిల్లరేడ్నించి తేవాలే. అరె దిగు బయ్ దిగు.. పీచేవాలే బస్‌కో పక్‌డో" అని కండక్టర్‌తో నాలుగు అక్షింతలు వేయించి.. బస్ స్టాప్ దగ్గర ఆపకుండా వెళుతున్న బస్సులో నుంచి ఇద్దర్ని రన్నింగ్‌లో దిగాలే చేయాలని...

పనిలో పనిగా షేర్ ఆటోలో ఆటో డ్రైవర్‌కు చేరో వైపు కూర్చోబెట్టి జనం రద్దీతో పాటు ఇరుగ్గా ఉండే దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ సినిమా హాల్ రోడ్డులో ఓ రౌండ్ వేయించాలని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో థాట్స్ వచ్చాయి. సామాన్యులకు అందనంత దూరంలో ఉండే ఇంటర్నేషనల్ లీడర్స్‌ను చూస్తుంటే నాలాంటి వాళ్ళ బుర్ర ఇలాగే తిరుగుతుందేమో?

1/16/2015

కుక్కను హీరోగా పెట్టి సినిమా తీస్తే..!

సంక్రాంతి పండగ కోసమని ఇవాళ ఒక తమిళ టీవీ ఛానల్‌లో ఓ సినిమా వచ్చింది. దాని పేరు ''నాయ్‌గల్ జాగిరిదై''. అంటే కొన్ని ఇళ్ల గేట్లకు ఉన్న బోర్డు మీద రాసుండే 'కుక్కలున్నాయి జాగ్రత్త' అని అర్థం. ఇప్పుడంతా తెలుగులో ఎవరు పెడుతున్నారు? తెలుగులో బోర్డులు రాసేవారెక్కడున్నారు? అవును రాయడమెందుకు? 'Beware of Dogs' అని కీ బోర్డు మీద టైప్ చేసి కంప్యూటర్‌లో దాన్ని సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకొని అట్ట ముక్కకు అతికించి గేటుకు తగిలించేస్తే సరిపోతుంది. పనిలోపనిగా సెర్చ్ ఇంజిన్‌లోకి వెళితే కుక్కల ఫోటోలు బోలెడు దొరుకుతాయి. వాటిలో ఒక దాన్ని తగిలిస్తే లుక్ ఇంకా బాగుంటుంది. సారీ.. సంగతి ఏటో పోయింది.

ఫోటో: యూట్యూబ్ డాట్ కామ్ సౌజన్యంతో

సరే ఈ ''నాయ్‌గల్ జాగిరిదై'' సినిమాలో హీరోగా.. మరి కుక్క సంగతి?.. చివర్లో చెబుతా. హీరోగా సత్యరాజ్ అని ఒకప్పటి తమిళ హీరో కొడుకు శిబిరాజ్ నటించాడు. ఈ సత్యరాజ్ మన తెలుగువాళ్లకు బాగా తెలిసినవాడే. ఒకప్పుడు చిరంజీవి 'జ్వాల'కు దీటుగా సుమన్ 'దర్జాదొంగ' వచ్చింది. ఆ దర్జాదొంగ సినిమాలో మారుతి కారులో తిరుగుతూ దర్జాగా మర్డర్లు చేసే విలన్‌గా బీభత్సంగా యాక్ట్ చేశాడు ఈ సత్యరాజ్. మనోడు సీన్‌లోకి రాగానే ఇళయరాజా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేది.

మామూలుగా ఎవరైనా నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి సినిమా తీస్తుంటే ఆ సినిమా అంతా తన కొడుకే మీదే ఫోకస్ అవ్వాలని కోరుకుంటాడు. ముఖ్యంగా మన నిర్మాతల గురించైతే అసలు చెప్పక్కర్లేదు. అలాంటిది ఈ సత్యరాజ్ తన కొడుకు శిబిరాజ్‌కు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సినిమా అంతా కుక్కతోనే చుట్టేశాడు. కానీ డైరక్టర్ వెంకట్ సౌందర్ రాజన్ ఈ సినిమాను ఎంత బాగా తీసాడంటే పండుగ పూట టీవీ ఛానల్స్‌లో బ్రేక్ వచ్చిందంటే యాడ్స్ కుప్పలుతెప్పలుగా వచ్చి పడతాయి. అలాంటప్పుడు వేరే ఛానల్‌కు వెళ్ళిపోతాను. కానీ ''నాయ్‌గల్ జాగిరిదై'' సినిమా కంటిన్యుటీ ఎక్కడ మిస్సవుతానో అని యాడ్స్ అన్ని భరించా.

కుక్క దాని విశ్వాసం గురించి ఎన్టీఆర్ 'ఆత్మబంధువు' ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. కుక్క ఎంతో గొప్పదో మాములు వాళ్ల కంటే కూడా దాన్ని పెంచుకునే వాళ్లకి బాగా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా వస్తున్నప్పుడు చూడమని ఓ ఫ్రెండ్‌కు ఫోన్ చేశా. కానీ వాడెక్కడో బజార్లో ఉన్నానని చెప్పాడు. కథ గురించి నేను చెప్పడం కాదు కానీ వీలుంటే ఈ సినిమాను చూడ్డానికి ట్రై చేయండి. కుక్కల మీద రాళ్లు వేసే వాళ్ళు, వాటిని చూస్తేనే చీదరించుకునేవారు ఏం మిస్సవుతున్నారో తెలుస్తుంది.

చివరగా విశ్వనాథుడు కొలువైన వారణాసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడే...

1/12/2015

నా రాతల వెనుక రాజేంద్రప్రసాద్

మానవ సంబంధాలతో పెనవేసుకున్న కథలకు జోరైన సాహిత్యం, హుషారైన సంగీతాన్ని జోడించి సినిమాలు తీసిన దర్శక, నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ ధనుర్మాసంలో సోమవారం నాడు 'దైవ సన్నిధానానికి' వెళ్ళిపోయారు. వీబీ కారణంగానే ఒకప్పటి ఫేమస్ ఫిల్మ్ మేగజైన్ 'విజయచిత్ర' నుంచి ఫస్ట్ టైమ్ రెమ్యునరేషన్ అందుకున్నాను. బిజినెస్‌లో నష్టపోయి ఖాళీగా ఉన్న కొడుకు జగపతిబాబును సినిమా హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంలో ఊహించడానికి సైతం వెనుకాడే ఒక సాహసానికి ఆయన పాల్పడ్డారు.
                                                       ఫోటో: యూ ట్యూబ్ డాట్ కామ్ సౌజన్యంతో

ధర్మేంద్ర, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్‌లతో హిందీలో వచ్చిన 'ఖత్రోంకే ఖిలాడీ' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. హిందీలో ఇద్దరు హీరోలుగా సంజయ్ దత్, మరో యాక్టర్ నటించారు. తెలుగులో 'సింహస్వప్నం' గా రీమేక్ చేసి రిలీజ్ చేశారు. జగపతి బాబు ఫస్ట్ సినిమా. పైగా డబుల్ యాక్షన్. కృష్ణంరాజు, జయసుధ ఇలా జగపతిబాబుకు అండగా చాలా మంది పెద్దలు సినిమాలో నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఆ సిని‌మా అంతగా ఆడలేదు.

'సింహస్వప్నం' మీద రివ్యూ రాసి విజయచిత్రకు పంపించాను. పబ్లిష్ అయ్యింది. నాకో వంద రూపాయలు వచ్చాయి. ఇదేదో బాగుందే అనిపించింది. అప్పట్నుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నా. అలా రాసినవి ఏదో ఒక దాంట్లో పడుతూనే ఉన్నాయి. ఆ విధంగా తన సినిమాతో నా అభ్యున్నతికి పరోక్షంగా కారకులైన వి.బి.రాజేంద్ర ప్రసాద్‌‌ నాకు చిరస్మరణీయులు.

1/07/2015

ఏక్ బడా గోల్డ్ ఫ్లేక్.. పంజాబ్‌లో కుదర్దు...

సిగరెట్ తాగడం ఓ పెద్ద మాయ రోగం.. నాలాంటి వాడు దాన్ని వదిలించుకోడానికి ఇప్పటికి ఓ వంద తీర్మానాలు చేసి ఉంటాడు. సినిమా మొదలయ్యే ముందు సిగరెట్ వద్దంటూ చెప్పే న్యూస్ రీల్‌ను కళ్లార్పకుండా చూస్తాం. ఇంటర్వెల్ కాగానే గబగబా వెళ్ళి రూపాయి ఎక్కువిచ్చి మరీ కొనుక్కుంటాం. ముక్కూ ముఖం తెలియని తోటి సిగరెట్ వ్యసనగ్రస్తుడి నుంచి నిప్పును ఉదారంగా తీసుకొని బెల్ కొట్టేలోగా ఉఫ్ ఉఫ్ మని ఊదేసి హాల్లోకి పరిగెత్తుకెళ్ళి సీట్లో  కూర్చొని గస పెడుతుంటాం.

ఇక డ్యూటీలో ఉన్నప్పుడైతే పెట్టె కొనుక్కుంటే ఎన్ని ఊదేస్తామో తెలియదు కాబట్టి బయటకెళ్ళి ఎదురుగా ఉన్న టీ కొట్లో "ఏక్ బడా గోల్ట్ ఫ్లేక్" అని అడిగేసి ఓ సిగిరెట్ తీసుకుంటాం. గాల్లోకి పొగ వదులుతూ చేయబోయే పని గురించి దీర్ఘాలోచనలో పడిపోతాం.
                                                           wallpaperseries.com సౌజన్యంతో
 
          అదే చెన్నయ్‌లో ఐతే "ఒరు కింగ్ కుడప్పా'' అని అడిగినా కానీ బడ్డీకొట్టువాడు రెండు సిగరెట్లు తీసి చేతికి ఇస్తుంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇకపై పంజాబ్‌లో నాలాంటి పొగరాయుళ్ళ పప్పులు ఉడకవనే వార్త పొద్దున్నే పేపర్లో చూశా.. అక్కడ గవర్నమెంట్ విడివిడిగా సిగిరెట్లు అమ్మడాన్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే విడి సిగరెట్ మీదా ఎలాంటి పుర్రె బొమ్మలు కానీ హెచ్చరికలు కానీ ఉండవట. అందుకని జనం విచ్చలవిడిగా సిగిరెట్లు తాగేస్తున్నారట. ఆ కారణంగా సిగిరెట్ పెట్టెలు మాత్రమే అమ్మాలని అక్కడి విక్రయదారులకు ఆర్డర్ ఇచ్చింది. ఇదీ ఒకందుకు మంచిదే. పెట్టె కొనుక్కునే స్తోమత లేనివాళ్ళు మెల్లమెల్లగా దురలవాటుకు దూరమౌతారు.

కానీ చిక్కల్లా నాలాంటి వాళ్లతోనే. మరొక పొగ రాయుడితో సిగిరెట్ పెట్టెను షేర్ చేసుకుందామనే ఎంఓయూ చేసుకుంటే ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా మా పొగరాయుళ్ళను బాగు చేయలేడు. 

1/06/2015

సాములందరూ చేరి

సాములందరూ చేరి సంతకెళ్ళారు.
శబరిగిరీశుని సమారాధనకు సరకులు తీసుకున్నారు.
ఆహార్యం నలుపు.. ఆహారం సాత్వికం..
                                                   (ఫోటో శబరిమల డాట్ ఓఆర్జీ సౌజన్యంతో)

స్వామి స్వామి అంటూ సాటి మనిషిలో హరిహరాదులను చూస్తూ
సామూహిక పడిపూజ వేళ కలసి భిక్ష చేస్తూ
మండల కాలం పూర్తి కానున్న వేళ తలపై ఇరుముడితో
పెద పాదం, చినపాదమేదైనా కానీ
భారం హరిహరసుతునిదే అని భావించి
పంపా నదిని చేరి పరమ పావన నదిలో స్నానాలు చేసి
ఆదిలోనే దర్శనమిచ్చిన గణపతికి మొక్కి
శరణు శరణు అంటూ పద్దెనిమిది మెట్లెక్కి
దివ్య కాంతులతో వెలుగుతున్న అయ్యప్పకు మొక్కి
మొక్కుల్లు తీర్చుకొని
మరుసటేడాది మళ్ళీ నీ దర్శనమీయవయా అని వేడుకొని
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వీడి ఐహిక ప్రపంచంలోకి అడుగుపెట్టి
సాంసారిక జీవనంలో తలమునకలైపోయే మనిషి
కష్టమొచ్చిన వేళ తలచుకొనును అయ్యప్ప.. అయ్యప్ప అని..

1/05/2015

బాలచందర్‌ను వెదుక్కుంటూ గణేశ్ పాత్రో

బాలచందర్‌ను వెతుక్కుంటూ గణేశ్ పాత్రో వెళ్ళిపోయాడు. బాలచందర్ తీసిన చాలా సినిమాలకు పాత్రో డైలాగులు రాశాడు. బహుశా అందుకేనేమో ఆ అనుబంధంతో ఆయన వెళ్ళిపోయిన కొద్దిరోజులకే అంటే జనవరి ఐదో తేదీన కన్నుమూశాడు. అభిమానించేవారిని ఏకవచనంతో సంబోధించడంలో తప్పులేదనుకుంటాను. అప్పుడే రాసే అక్షరాల్లో అసలైన అభిమానం తొంగి చూస్తుందనుకుంటా.

                        ఎడమ వైపు నుంచి గణేశ్ పాత్రో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.బాలచందర్ ('ఈటీవీ' సౌజన్యంతో)

 ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది. తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది. ఆడాళ్లంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. క్రాంతి కుమార్ డైరక్షన్‌లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశాడు. స్టోరీ కూడా అతడిదే అనుకుంటా. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీ పడ్డారు. కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా. అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. నాకు తెలిసి ఎన్టీఆర్, ఎఎన్నార్ సినిమాలను దాటి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాల చెవుల్లో మార్మోగిన సినీ డైలాగుల్లో 'స్వాతి' ఫస్ట్ ప్లేస్‌లో ఉండింది.

                           హిట్ కొట్టేసిన క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చాడు. లేడీస్ సెంటిమెంట్‌తో తీసినాకానీ స్వాతి రేంజ్‌లో ఆడలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటాడు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.

                            బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డబుల్ మీనింగ్ డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నాడు. జీవిత హీరోయిన్‌గా, రాజశేఖర్ విలన్‌గా అన్యాయమైపోయిన ఆడదాని గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చాడు. బాలచందర్ పుణ్యమాని గణేశ్ పాత్రోతో డైలాగులు రాయించుకునే అవకాశం అప్పటి సుప్రీంహీరో చిరంజీవికి 'రుద్రవీణ' తో దక్కింది. మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాట కూడా రాశాడు మన పాత్రో.


'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్‌తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తాడు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశాడు. కానీ గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా నచ్చలేదు. సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటాడు.

1/03/2015

ది బర్త్ ఆఫ్ తెలుగోల

మొత్తానికి నేనూ ఓ బ్లాగర్ ను అయ్యాను. సంతోషంగా ఉంది. ఒక్క భాషతోనే పనులు కానిద్దాం అంటే కాని రోజులివి. కనీసం రెండు భాషలు కలిపి కొడితేనే అవతలివాడికి మనమేం చెబుతున్నది అర్ధం కాని పరిస్థితి. అందుకే నా బ్లాగుకు తెలుగోల అనే పేరు పెట్టాను. అంటే ఓ తెలుగోడికి నాలుగు భాషలు తెలిస్తే వాడు రాసింది చదివే వారి బుర్ర ఎంత హీటెక్కిపోతుందో చెప్పడానికే ఈ పేరు.

దారిని పోయేటప్పుడు తగిలేవారు... పనీపాటా లేకుండా టీవీ ముందు కూర్చున్నప్పుడు బుర్రలో పుట్టుకుచ్చే ఐడియాలను నాలుగు రాతల్లో గీకి పారేస్తే మన పనైపోతుందనే తత్వంతో ఇందులోకి దూకా. సాధ్యమైనంతవరకు ఎవర్ని బాధ పెట్టకుండా నాకు తోచింది నాకు నచ్చినట్లుగా రాద్దామనే తపనతో ఈ దారిలోకి వచ్చాను.

              ఇదంతా మాకెందుకు అదేదో పత్రికలకు పంపించవచ్చు కదా అని మీరడగవచ్చు. ఒక్కో ప్రతికది ఒక్కో ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీకి తగ్గట్లుగా మన ఎమోషన్స్ ను, ఐడియాస్ ను మౌల్డ్ చేసుకుంటూ కాంప్రమైజ్ ఐపోయి పెన్నుతో అలికేసిన కాగితాలను వాటికి పంపించాలి. ఎందుకొచ్చిన తలనెప్పి అనుకొని ఇటొచ్చి పడ్డా. రోజూ ఏదోకటి రాసి దీంట్లో పడేద్దామనే ఆలోచనతో ఇందులోకి వచ్చా. ఐతే ఇక్కడో కండిషన్ ఉంది. నా రాతల గురించి మీ ఒపినియన్ ముఖం మీద ఒకటి ఇచ్చినట్లుగా ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇవాల్టికి ఇక్కడితో తెలుగోల సమాప్తం.