6/04/2020

సంగీత నిధి పుట్టినరోజు

ఇవాళ (జూన్ 4) ప్రముఖ సినీ సంగీతకారులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి జన్మదినం. నాకు వారు గాయకుడిగా కంటే కూడా సంగీత దర్శకులుగానే ఎంతో ఇష్టం. బాలూగారు మళ్ళీ ఏదైనా సినిమాకు స్వరపరిస్తే చూడాలని, వినాలని ఆశపడుతుంటాను.

వారు సంగీతం దర్శకత్వం వహించగా నేను విన్న తొలిపాట బాపుగారి డైరెక్షన్‌లో మోహన్, జ్యోతి జంటగా 'తూర్పు వెళ్ళే రైలు' సినిమాలో "కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటే కోడిపుంజు కొక్కొరోకో". ఆ తర్వాత విజయనిర్మలగారి దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల హీరో హీరోయిన్లుగా 'కెప్టెన్ కృష్ణ' మూవీలో 'కలకాలం ఇదే సాగని' అనే పాట నా బుర్రకు బాగా పట్టేసింది.

సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో సుధాచంద్రన్, శుభాకర్ ప్రధాన పాత్రల్లో విడుదలైన 'మయూరి' సినిమాకు వచ్చేసరికి భారతీయ సంగీతం పట్ల ఆయనకున్న అవగాహన, మమకారం, అభిమానం ప్రతి పాటలోనూ మనకు వినిపిస్తుంది. ఒక్కోపాట ఒక్కో ధోరణిలో సాగుతుంది. పాటలా సాగుతుంటే ఒక చోట బెంగాలీ సంగీతంలో ఒక భాగమైన గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించిన 'రవీంద్ర సంగీత్' ఛాయలు వినిపిస్తాయి. ఇదేదో బాగుంది కదా అని వింటుంటే తెలుగు పల్లెల్లో జానపదం వినపడి గుండె ఝల్లుముంటుంది.

జంధ్యాల గారి దర్శకత్వంలో  'పడమటి సంధ్యారాగం' సినిమాలో బాలసుబ్రహ్మణ్యంగారు స్వయానా రచించిన, స్వరపరిచి, గానం చేసిన ఓ ఇంగ్లీషు పాటకు దీటుగా సినిమాలో విజయశాంతిని ఆరాధించే ఓ విదేశీయుడిగా ప్రముఖ డ్రమ్మర్ శివమణి అభినయం చాలా బాగుంటుంది.

విజయబాపినీడు గారి డైరెక్షన్‌లో చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన 'మగధీరుడు' అనే సినిమాక్కూడా ఆయన స్వరాలందించినట్టు గుర్తు.

బాపు గారి దర్శకత్వంలో శోభన్ బాబు, సుహాసిని జంట 'జాకీ' అనే సినిమాకు కూడా బాలు గారు సంగీతం అందించారు. ఆ సినిమాలో ఎస్.జానకి గారు ఆలపించిన 'అలా మండిపడకే జాబిలి' పాటలో మాధుర్యంతో కూడిన నాయిక మనోవేదన రేడియోలో విన్నా మన కళ్ళకు కడుతుంది.

ఆ తర్వాత ఎం.వి.రఘుగారి డైరెక్షన్‌లో 'కళ్ళు' సినిమాకు వచ్చేసరికి ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు స్వయంగా రాసి పాడిన 'తెల్లారింది లెగండో కొక్కొరోకో' పాటను బాలసుబ్రహ్మణ్యంగారు స్వరపరిచిన వైనం మనలోని పామరుడ్ని తట్టి లేపుతుంది.

అనంతరం నాగార్జున, విజయశాంతి జంటగా ఉప్పలపాటి నారాయణరావుగారి దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన 'జైత్రయాత్ర' సినిమాకు కథానుగుణంగా, సన్నివేశాలపరంగా సంగీతం అందించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు తాను అన్ని రకాల సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగలనని నిరూపించుకున్నారు.


నావరకు వచ్చేసరికి బాలుగారి మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందిన పాటలు భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అదెలాగంటే నేను సీరియస్‌గా గాయకుడు లేదా గాయకురాలి గాత్రం వింటూ ఉంటానా.. ఈ లోగా ఎక్కడి నుంచో ఓ వేణువో, సన్నాయో, అప్పుడప్పుడు అకార్డియన్ వాయిద్యం నుంచి సంగీతం అలా ఊడిపడి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటుంది.

ఇన్నేళ్ళ కాలంలో, బాలు సుబ్రహ్మణ్యంగారి సంగీత దర్శకత్వంలో నేను విన్న పాటల్లో, నేను గమనించింది ఏమిటంటే వారికి పియానో, ఫిడేలు, ఢోలక్, కాంగో డ్రమ్స్ అంటే ఎక్కువ ఇష్టమని.

నాకిష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరైన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికివే నా జన్మదిన శుభాకాంక్షలు

--- మహేష్ ధూళిపాళ్ళ

No comments:

Post a Comment