3/29/2016

ఇన్నేం చేసుకోను?

మామూలుగా ఎవరికైనా అవార్డు రాగానే మన సినిమా విలేకరులు అడిగే మొదటి ప్రశ్న మీకెలా అనిపిస్తుందని? ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు స్వీకరించబోతున్న ఇళయరాజాను ఇప్పుడు కనుక ఎవరైనా ఇలాంటి ప్రశ్నే అడిగితే... ఇన్ని అవార్డులు నేనేం చేసుకోను? అని అమాయకంగా ప్రశ్నిస్తారామో అనిపిస్తుంది. దైవత్వానికి, మోక్ష సాధనకు దగ్గరిదారి శాస్త్రీయ సంగీతం అంటుంటారు దాన్ని అంతు చూడాలని ప్రయత్నించినవారు. అక్కడైనా, ఇక్కడైనా ఏడు స్వరాలతోనే పని. అలాంటప్పుడు శాస్త్రీయ సంగీతానికి, సినిమా సంగీతానికి ఎందుకిలా అడ్డుగోడలు కట్టుకుంటూ బావిలో కప్పల్లా బతికేస్తున్నాం?

సినిమాకు సగటున ఐదు పాటలు వేసుకున్నా వెయ్యి సినిమాలతో ఐదు వేల పాటలకు స్వర రచన చేశారు ఇళయరాజా. నాకు తెలిసి గత ఇరవై ఏళ్లుగా తెల్ల పంచె, తెల్ల జుబ్బా, నుదుటిన కుంకుమ బొట్టు, ఈ మధ్యనే తలనీలాలు ఇచ్చినట్టుగా కనిపించే తలకట్టు.. ఇదీ ఇళయరాజా ఆహార్యం. రమణ మహర్షి భక్తునిగా ఆయన పొందిన నిరాడంబరత్వానికి ఇది నిదర్శనమేమో అనిపిస్తుంది. అలాగని సినీ సంగీతంలో తన అభిరుచిని, అలవాట్లను చొప్పేందుకు ఆయన ప్రయత్నించలేదనుకుంటా.

అందరికి తెలిసిన సంగతులైనా ఓసారి మళ్లీ చెప్పుకోవడానికి ఇదో సందర్బంగా వాడుకుంటున్నా. ఫాస్ట్ బీటైనా, స్లో సాంగైనా నేపథ్యంగా మాధుర్యాన్ని(మెలోడీ) వినిపింపజేయడం మంచి సంగీతం పట్ల ఇళయరాజాకున్న మమకారానికి నిదర్శనం. తొలి చిత్రం 'అన్నకిలి' చిత్రంలో తమిళనాట పల్లె పలుకుబడికి, జనపదాలకు పెద్దపీట వేశారు. తరతరాలుగా ఊరూరా తిరుగుతూ భిక్షమెత్తుకునే ఓ సంచార జాతి వినియోగించే వాయిద్య పరికరాలను అన్నకిలిలో వినసొంపుగా వినిపించారు ఇళయరాజా. ఆ బాణీలు విన్న తమిళుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

సినిమా రిలీజైనప్పుడు సంగీత దర్శకుడికి సినిమా హాళ్ల దగ్గర కటౌట్లు పెట్టడమనే అభిమాన సంప్రదాయం ఇళయరాజాతోనే మొదలైంది. ఎన్టీఆర్‌, ఇళయరాజా కలిసి చేసిన ఏకైక సినిమా యుగంధర్. మాస్ హీరో ఎన్టీఆర్ యాక్షన్ మూవీలో సైతం ఒకటి రెండు పాటల్లో మెలోడీ వినిపించింది. 'పుట్టాం కనుక తప్పదు చావక' అంటూ మాఫియా డాన్ ఎన్టీఆర్ ఓ పాటలో తత్వం చెబుతుంటే కూడా వచ్చే బాణీ వినాలా లేక సాహిత్యం వినాలా అనే అయోమయంలో చిక్కుకుంటాడు సినీజీవి.

శోభన్‌బాబుతో సోలోగా చేసిన సినిమా 'రాజ్‌కుమార్'. ఇందులో కూడా 'జానకి కలగనలేదు... రాముడు సతి కావాలని' అనే పాట అద్భుతమనిపిస్తుంది. శోభన్ బాబు ఫైటింగ్ చేస్తుంటే... అదేదో సినిమాలో అమ్రీష్ పురి చెప్పినట్టు వయొలిన్‌తో వయొలెన్స్ వినిపించారు ఇళయరాజా. శోభన్‌బాబు అభిమానులకు కొత్తగా అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రయోగాలు కనిపిస్తుంటాయి సారీ వినిపిస్తుంటాయి ఇళయరాజా సంగీతంలో.

నాగార్జున సినిమా 'సంకీర్తన' గురించి ఇప్పటికీ అక్కడా ఇక్కడా చెప్పుకుంటున్నారంటే అది ఇళయరాజా చలవే. నాగార్జునకు లైఫిచ్చిన 'గీతాంజలి', 'శివ' సినిమాలను మ్యాస్ట్రో మ్యూజిక్ లేకుండా ఊహించుకోలేం. కేవలం ఆయన సంగీతం కారణంగానే ఆడిన సినిమాలు కోకొల్లలు.

'దళపతి' సినిమా అప్పుడు ఇళయరాజాకు, మణిరత్నానికి మనస్పర్థలు వచ్చాయని వార్తలు వచ్చాయి. వాటి నుంచే ఎ.ఆర్.దిలీప్ అలియాస్ ఎ.ఆర్.రెహ్మాన్ అనే సంగీత దర్శకుడు రోజాతో పరిచయమయ్యాడు. ఇంగ్లీషు సినిమాకు స్వరాలందించి భారతీయ సంగీతానికి ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చి పెట్టాడు.

ఇప్పటి దర్శకులు ఇళయరాజాను మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ సినిమాలకు తీసుకున్నప్పుడు 'లయన్ ఈజ్ బ్యాక్' అంటూ పబ్లిసిటీ ఇచ్చుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ మధ్య తెలుగులో వచ్చిన అమ్మాయి అబ్బాయి సినిమాక్కూడా ఇళయరాజా బాణీలు అందించారు. మాధుర్యం పట్ల తనకున్న మక్కువను మరోసారి చాటుకున్నారు. ఆయన సంగీతం చిరంజీవి. 

No comments:

Post a Comment