3/22/2016

చక్రాల కుర్చీ జిందాబాద్

'ఊపిరి' సినిమాలో నాగార్జున చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి పాత్రలు చేస్తామని ఆయన అంటున్నారు. కానీ హీరోలు చక్రాల కుర్చీని ఆశ్రయించిన సినిమాలు గతంలో చాలా వచ్చాయి. అలాగే పెద్ద హీరోలు అప్పుడప్పుడు వారి భార్య పాత్రలు చక్రాల కుర్చీలో కూర్చున్న దాఖలాలు ఉన్నాయి. తెలుగు సినీ చరిత్రను కాస్త లోతుగా పరిశీలించినవారికి నిర్మాతలకు ఆ కుర్చీ కాసుల పంట కురిపించింది. కొత్త ట్రెండ్ సృష్టించింది. ఆ కథాకమామీషు ఎంటో ముందుగా ఎన్టీఆర్‌తో మొదలుపెడదాం.
1960ల్లో వచ్చిన 'గుడి గంటలు' చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్‌ను సరికొత్త కోణంలో చూపించిందీ చిత్రం. ఈ చిత్రంలో కొంతసేపు చక్రాల కుర్చీలో కనిపిస్తారు ఎన్టీఆర్. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అంటే 1982లో ఇదే ఎన్టీఆర్ డబుల్ యాక్షన్‌లో కనిపించిన 'కొండవీటి సింహం' సినిమా విడుదలైంది. ఇందులో పెద్ద ఎన్టీఆర్ భార్యగా జయంతి నటించింది. అనారోగ్యంతో చక్రాల కుర్చీని ఆశ్రయిస్తుంది జయంతి. ఆ సందర్భంగా 'మా ఇంటిలోన మహలక్ష్మి నీవే' అనే పాటలో ఆమెను కుర్చీలో తిప్పుతూ పెద్ద ఎన్టీఆర్ సేవలు చేస్తుంటే చిన్న ఎన్టీఆర్ కూడా వచ్చి ఓ చెయ్యి వేస్తాడు. సినిమాతో పాటు ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇలా కూడా పాట తీయవచ్చన్నట్టుగా డైరెక్టర్ రాఘవేంద్రరాపు ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు అప్పట్లో.
దాదాపు అదే రోజుల్లో వచ్చింది 'గృహప్రవేశం' సినిమా. మోహన్ బాబు, జయసుధ జంటగా నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అసలు హీరో జయసుధ. ఆ పాత్రను కూడా అలాగే తీర్చిదిద్దారు దర్శక, రచయితలు. అనారోగ్యం పాలైన జయసుధను చక్రాల కుర్చీలో తిప్పుతూ 'దారి చూపిన దేవత' అంటూ కే.జె.ఏసుదాసు పాడిన పాటకు పెదవులు కదుపుతూ నటించాడు మోహన్ ‌బాబు. ఇంకేముంది ఫ్యామీలలకు ఫ్యామిలీలు క్యూ కట్టేసి అదే పనిగా 'గృహప్రవేశం' చేశారు. నిర్మాతకు కనక వర్షం కురిపించారు.
ఇంతమంది చేస్తున్నది నేనెందుకు చేయకూడదనుకున్నారు అక్కినేని. అన్నీ తానై దాసరి నారాయణరావు రూపొందించిన 'బహుదూరపు బాటసారి' చిత్రంలో చక్రాల కుర్చీ ఎక్కేశారు. అంతటితో ఆగక చేతి ఊతం కర్రలతో దొంగలను చితకబాదేశారు కూడా. ఇక చెప్పేదేముంది ఈ సినిమాకు సైతం బ్రహ్మరథం పట్టారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్యనే శ్రీను వైట్ల డైరెక్షన్‌లో నాగార్జున హీరోగా వచ్చిన 'కింగ్' సినిమాలో చక్రాల కుర్చీ బ్రహ్మాండంగా కామెడీ పండించింది. నిర్మాతను సేఫ్ జోన్‌లోకి నెట్టేసింది. మళ్లీ ఇప్పుడు అదే నాగార్జున ఈ సినిమాకు నేనే 'ఊపిరి' అంటూ అదే కుర్చీని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. అంత గట్టిగా పట్టుకున్నాక దాని సెంటిమెంట్ పనిచేయదని మనం మాత్రం ఎందుకు అనాలి? ఎవరి సెంటిమెంట్లు వారివి.. ఆల్ ది బెస్ట్ నాగార్జున

No comments:

Post a Comment