6/22/2020

ఆయన మాటలు.. ఆడవాళ్ళకు మాత్రమే..!

ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది.

తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది.

మహిళలంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని టికెట్లు సంపాదించుకోవడంలో మగాళ్లు కనిపించేవారు. 

క్రాంతి కుమార్ డైరక్షన్‌లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశారు. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీపడి మరీ నటించారు. కంచుకంఠం జగ్గయ్య, కపిల్ దేవ్ ఫ్యాన్ సంయుక్త, శుభలేఖ సుధాకర్ సంగీత కచ్చేరీకి పక్క వాయిద్యాల్లా సినిమాకు పనికి వచ్చారు. స్వాతికి కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా.

అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. ఎన్టీఆర్, ఎఎన్నార్‌లను దాటి చిరంజీవి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాలు అలా డైలాగులు వినడంలో 'స్వాతి' శభాష్ అనిపించుకుంది.

'స్వాతి' హిట్ ప్యాకెట్‌‌లో వేసుకున్న క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. 'మైక్' మోహన్, శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్లు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చారు. అయినా కానీ 'స్వాతి' రేంజ్‌లో ఆడలేదు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ, డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటారు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.

బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నారు పాత్రో.

చిరంజీవి 'రుద్రవీణ' కూ గణేష్ పాత్రో డైలాగులే. ఈ సినిమాలోనూ లేడీస్‌కు పెద్దపీట వేశారు పాత్రో. వీలుంటే ఓసారి ఆ సినిమా చూడండి లేదంటే గుర్తు చేసుకోండి. హీరోయిన్ శోభనక్కానీ, హీరో వదిన ప్లస్ భావోద్వేగాలు ఆపుకోలేక నాదస్వరం వాయించే ప్రసాద్‌బాబు భార్యకు పాత్రో రాసిన డైలాగులు సందర్భోచితంగా ఉంటాయి.

జీవిత హీరోయిన్‌గా, రాజశేఖర్ విలన్‌గా అన్యాయమైపోయిన అబల గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చారు పాత్రో.

మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటతో నేను పాటలు కూడా రాయగలను సుమా అని ప్రూవ్ చేసుకున్నారు.

'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్‌తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశారు. కానీ చిన్నప్పటినుంచి ఆయన మాటలు వినీవినీ ఉండటం వల్ల, గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా ఎక్కలేదు. అయితే ఆయనిచ్చిన ఫినిషింగ్ టచ్‌తోనే సినిమా నిలబడిందని నాకు తెలిసిన కొందరు సినీజనాలు చెబితే.. దటీజ్ గణేశ్ పాత్రో అని మురిసిపోవడం నా వంతుగా మారింది.

సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన గణేశ్ పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు.

(జూన్ 22: నాటకాలు, సినిమాల రైటర్ గణేశ్ పాత్రో జయంతి.)

--- మహేష్ ధూళిపాళ్ళ

6/19/2020

'అబ్బాయిగారు'.. ఎంత పనిచేశారు?



టైటిలు అబ్బాయిగారు, వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లు; కథ కె భాగ్యరాజా, డైలాగులు జంధ్యాల, డైరెక్షను ఇవివి సత్యనారాయణ.

వాట్టే కాంబినేషన్ అనుకున్నారు జనం.

ఫస్ట్ రోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో మార్నింగ్ షో చూసి బైటకు రాగానే సినిమాకు మంచి టాక్.

దాన్తో పాటు ఓ సైడు టాకు. "అసలు జంధ్యాల ఏమిటి.. ఇలా డబుల్ మీనింగు డైలాగులు రాయడమేటి?" అని.

ఈ సైడు టాకు ఏ రేంజ్‌కు చేరుకుందంటే.. ఓ రోజు జంధ్యాలగారు ప్రెస్ వాళ్ళను పిలిచి "ఆ డైలాగులు నావి కావు" అని క్లారిటీ ఇచ్చేదాకా.



++       ++   ++   ++

టైటిలు భారతీయుడు, కమల్ హాసన్ డబుల్ యాక్షన్, శంకర్ డైరెక్షన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్కు.

కథ అంటే కరప్షన్ మీద ఓ ఫ్రీడమ్ ఫైటర్ చేసే ఫైటు. క్లయిమాక్సులో కన్న కొడుకును ఖతం చేసేసిన పెద్ద కమల్ హాసన్ ఫ్లయిట్ ఎక్కేసి ఫారిన్ చెక్కేస్తాడు. అక్కడ్నుంచి ఇండియాలో ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన వారు 'ఎవరు మాట్లాడేది' అని అడగ్గానే 'భారతీయుడు' అని పెద్ద కమల్ హాసన్ స్టయిల్‌గా చెప్తాడు. తెర కిందకు దిగుతుండగా జనం హాల్లోంచి బైటకు వచ్చేస్తారు.

సినిమా తెగ ఆడేస్తోంది. ఎక్కడ చూసినా ఆ సినిమా సంగతులే.  అదే టైమ్‌లో జంధ్యాల గారు ఓ వార పత్రికలో వారం వారం పాఠకుల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. అందులో ఒకటి ఇలా ఉంది..

ప్రశ్న: 'భారతీయుడు' సినిమా గురించి మీ అభిప్రాయం?

జంధ్యాల: ఫారిన్ పారిపోయిన 'భారతీయుడు' గురించి ఏం చెప్పమంటారు?

(రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ జంధ్యాలగారి వర్థంతి ఈ రోజు జూన్ 19న)

---- మహేష్ ధూళిపాళ్ళ

6/16/2020

అన్ని రోజులూ.. అవే పాటలు..!

'డిస్కో డ్యాన్సర్' సినిమా రిలీజైన రోజులవి. నేనప్పుడు ఒంగోల్లో ఓరియంటల్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వేరే స్కూల్ వాళ్ళు బెంగళూరు, మైసూరు, విజయనగరం(కర్ణాటక), శ్రావణ బెలగోళ లాంటి కర్ణాటకలో పేరున్న ప్రాంతాలకు బస్ ట్రిప్ వేశారు.

అదెలా కుదిరిందో తెలీదు కానీ నేను మా అన్నయ్య కూడా ఆ ట్రిప్‌లో మెంబర్స్ అయిపోయాం. బస్సు రాత్రిపూట ఒంగోల్లో గంగాణమ్మ లేదా గంగాళమ్మ  గుడి దగ్గర నుంచి బయలుదేరింది. లైఫ్‌లో మొట్టమొదటిసారి లాంగ్ టూర్‌కు వెళడం.

క్లీనరు క్యాసెట్ ప్లేయర్ పెట్టాడు. 'ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్' అని పాట మొదలైంది. ఓ అరగంట గడిచాక నిద్రపోవడానికని పాటలు కట్టేశాడు క్లీనరు.

పొద్దున లేచాం. ఏ ఊరో తెలీదు. ఏదో దేవాలయం దగ్గర బస్సు ఆపాడు డ్రైవరు. అందరం కాలకృత్యాలు తీర్చుకున్నాం. వంటవాళ్ళు బస్ టాప్ మీదున్న సామాన్లన్నీ దింపి బొంబాయి రవ్వ ఉప్మా, శెనగపప్పు చెట్నీ చేశారు.

అంతా అయిపోయాక బస్సు ఎక్కాం. బస్సు ఎక్కగానే 'జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా' అంటూ మళ్ళీ 'డిస్కో డ్యాన్సర్' పాటలు మొదలయ్యాయి. రాత్రి క్యాసెట్ మిగిలిపోతే పెట్టాడేమో అనుకున్నాను.

కానీ 'డిస్కో డ్యాన్సర్' పాట కచ్చేరీ అక్కడితో ఆగిపోలేదు. టూర్ ఎన్నిరోజులు జరిగిందో గుర్తు లేదు కానీ, కర్ణాటక అంతా తిరిగి తిరిగి.. తిరిగి ఒంగోలు వచ్చేదాకా అవేపాటలు వేస్తూనే ఉన్నాడు. మేమంతా వింటూనే ఉన్నాము.

ఆ పాటలకు బస్సులో ఉన్న ప్రయాణికులమంతా ఎంతలా కనెక్ట్ అయ్యామంటే.. ' ఏ ఒక్కరూ ఇక ఆపరా బాబూ..' అని అనకపోవడం విశేషం.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే 'డిస్కో డ్యాన్సర్' హీరో మిథున్ చక్రవ(బ)ర్తి బర్త్ డే ఈ రోజు (జూన్ 16).

--- మహేష్ ధూళిపాళ్ళ

బిగ్ బాస్‌ బాదేస్తే.. పెదరాయుడు బతికించాడు..!

1995, జూన్ 15... నేనూ.. ప్రకాశం జిల్లాలో విజన్‌టెక్ ఎస్టీడీ కంప్యూటర్ల వ్యాపారం మొదలుపెట్టి అప్పటికి ఎనిమిది నెలలైంది. పనిమీద  ఆ రోజు చీరాల వెళ్ళాను. పది రూపాయలకే జీడిపప్పు ఉప్మా పెట్టే కాకా హోటల్‌లో ఉప్మా తినేసి బైటకు వచ్చి చూస్తే ఎదురుగా కనిపిస్తున్న హాలు ముందు విపరీతంగా జనం. అందులో పెదరాయుడు సినిమా ఆ రోజే రిలీజైంది. అదే రోజు బిగ్ బాస్ సినిమా కూడా వచ్చింది.

అప్పటికే బిగ్ బాస్ సినిమా మీద సెటైర్లు. బిగ్ బాస్ బిగ్ లాస్ అనే కామెంట్లు. కానీ ఎంతైనా సుప్రీం హీరో కదా. పైగా గ్యాంగ్ లీడర్ రేంజ్‌లో ఊహించేసుకోని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము. ఒంగోల్లో అతి పెద్ద సత్యం హాల్లో కుటుంబ సమేతంగా బిగ్ బాస్ చూశాను. ఏందిరా బాబూ ఇలా తీశారు సినిమా అనుకుంటూ బైటకు వచ్చాము. అప్పట్లో సినిమా హాళ్లలో మధ్యలో ఏసీ ఆపేస్తుండేవారు. దాని ఎఫెక్టో లేక సినిమా ఎఫెక్టో అందరి ముఖాలు కళ తప్పి జిడ్డు పట్టి ఉన్నాయి. ఆ దెబ్బకు నేనైతే పెదరాయుడ్ని అస్సలు పట్టించుకోలేదు.

ఆ తర్వాత కొంతకాలానికి బిజినెస్ పనిమీద హైదరాబాద్ వచ్చాను. తెలిసినవాళ్లందరూ చూడరా.. చూడరా అంటే అతి కష్టమ్మీద నారాయణగూడలో అతి పెద్ద శాంతి హాల్లో పెదరాయుడు సినిమా చూశాను. పడిశం పట్టినవాడికి అమృంతాజనం ఆవిరిపడితే కఫం ఎలా బైటకు వస్తుందో.. అలా పెదరాయుడు పుణ్యామాని బిగ్ బాస్ ఎఫెక్ట్ నుంచి బైట పడ్డాను.

పాతికేళ్ళ క్రితం పట్టిన పడిశం మీడియాకు ఇంకా వదిలినట్టు లేదు. అందుకే ఎక్కడా బిగ్‌బాస్ మాటే లేదు. నిఝంగా నొప్పిస్తే.. చిరంజీవి అభిమానులు మన్నించాలి.

బిగ్ బాస్ అసలైన బాధితుడు ఎవరంటే?

బిగ్ బాస్ సినిమా ఫెయిల్యూర్‌కు నిజమైన బాధితుడు ఎవరంటే.. ఎం సంజీవి. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. సినిమా రైటర్స్ సత్యమూర్తి, దివాకర్ బాబు లాంటి వాళ్లతో పాటుగా ఇండస్ట్రీకి వచ్చారు.

ఆయన చాలా సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశారు. ముఖ్యంగా విజయబాపినీడు తీసిన సినిమాలకు, ఈతరం పిక్చర్స్ బ్యాన‌ర్‌పై వచ్చిన సినిమాలకు సంబంధించిన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించే విషయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా వేశారు. అప్పట్లో చిరంజీవి పేరుతో విజయబాపినీడు తీసుకొచ్చిన మ్యాగజైన్‌కు వెన్నెముకగా నిలిచారు ఎం.సంజీవి.

అలా కిందా మీదా పడి పడీ, ఎన్నో సినిమాలకు తెరవెనుక పనిచేసి చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ సినిమా టైటిల్స్‌లో "మాటలు ఎం సంజీవి" అనే పేరు దక్కించుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘోరంగా దెబ్బతినడంతో సంజీవి తెరమరుగైపోయారు. సోషల్ మీడియాలోనూ కానరాకుండా పోయారు.

సెంటిమెంట్లకు పెద్ద పీట వేసే సినిమా ఫీల్డులో పెద్ద హీరో సినిమా ఆడకపోతే.. సంజీవి లాంటి వారే కాదు బాటమ్‌లో ఉండే క్లాప్ బాయ్ నుంచి టాప్‌లో ఉండే డైరెక్టర్ దాకా ఎంతటివారైనా సరే గల్లంతైపోతారు.
--- మహేష్ ధూళిపాళ్ళ 

6/05/2020

'బెస్ట్' బస్సుల్లో ప్రణయ ప్రయాణాలు.. తేనీటితో ప్రియ సంభాషణలు


బొంబాయిలో (ఇప్పటి ముంబై) అటూ ఇటూ తిరిగే 'బెస్ట్' సిటీ బస్సులు
బస్టాప్పుల్లో రకరకాల జనాలు
స్ట్రీట్ కార్నర్‌లో విశాలంగా కనిపించే తేనీటి రెస్టారెంట్లు
వాయిల్ చీరల్లో గొడుగు చేత పట్టుకొని నవ్వుతూ నడిచి వెళుతుండే సాదా సీదా హీరోయిన్లు
పెద్ద కాలరు షర్టు, బెల్ బాటమ్ ప్యాంట్లలో బిత్తర చూపులు చూస్తూ హీరోయిన్లను ఫాలో అయ్యే బిడియపు హీరోలు
ఇరుకిరుకు ఇంట్లో మసిపట్టిన వంటింట్లో కిరసనాయిల్ స్టవ్
హాలు కమ్ బెడ్రూమ్‌లో ఆగి ఆగి తిరిగే సీలింగ్ ఫ్యాన్
అదే గదిలో కథను మలుపు తిప్పే కీలక నిర్ణయాలు
రంగులు పోయిన అపార్ట్‌మెంట్ టెర్రస్ పైన తీగలపై వేలాడుతున్న బట్టలు
అలాంటి వాతావరణంలోనే మంచి మంచి రొమాంటిక్ సాంగ్స్.
ఇదంతా కలిస్తే డైరెక్టర్ బసు చటర్జీ తీసిన ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుంది.

ఆయన హిందీ, బెంగాలీ భాషల్లో మిడిల్ క్లాస్ లైఫ్‌పై సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌. పత్రికల్లో కార్టూనిస్టుగా పనిచేసిన తర్వాత రాజ్ కపూర్ హీరోగా వచ్చిన తీస్రీ మంజిల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. బసు చటర్జీ తన 39వ ఏట డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టారు.

70వ దశకం చివర్లో అమోల్ పాలేకర్, జరీనా వహాబ్ జంటగా బసు దా డైరెక్ట్ చేసిన చిత్ చోర్ సినిమా రిలీజైంది. సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. మన తెలుగు సినిమాకు చంద్రమోహన్ ఎలాగో హిందీ సినిమాకు అమోల్ పాలేకర్ అలాగ. బసు చటర్జీ తాను వెండి తెరకు పరిచయం చేసిన అమోల్ పాలేకర్ హీరోగా ఎక్కువ చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఇదే చిత్ చోర్ సినిమా తెలుగులో అమ్మాయి మనసుగా వచ్చింది. చంద్రమోహన్, జయసుధ హీరో హీరోయిన్లు.

అలా తనకంటూ వెండితెరపై ఒక ముద్ర వేసిన బసు చటర్జీ గురువారం అంటే జూన్ నాల్గవ తేదీన తన 93వ ఏట ముంబైలోని స్వగృహంలో కన్నుముశారు. వారికిదే నా నివాళి

-- మహేష్ ధూళిపాళ్ళ

6/04/2020

సంగీత నిధి పుట్టినరోజు

ఇవాళ (జూన్ 4) ప్రముఖ సినీ సంగీతకారులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి జన్మదినం. నాకు వారు గాయకుడిగా కంటే కూడా సంగీత దర్శకులుగానే ఎంతో ఇష్టం. బాలూగారు మళ్ళీ ఏదైనా సినిమాకు స్వరపరిస్తే చూడాలని, వినాలని ఆశపడుతుంటాను.

వారు సంగీతం దర్శకత్వం వహించగా నేను విన్న తొలిపాట బాపుగారి డైరెక్షన్‌లో మోహన్, జ్యోతి జంటగా 'తూర్పు వెళ్ళే రైలు' సినిమాలో "కో అంటే కోయిలమ్మ కోకో.. కో అంటే కోడిపుంజు కొక్కొరోకో". ఆ తర్వాత విజయనిర్మలగారి దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల హీరో హీరోయిన్లుగా 'కెప్టెన్ కృష్ణ' మూవీలో 'కలకాలం ఇదే సాగని' అనే పాట నా బుర్రకు బాగా పట్టేసింది.

సింగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో సుధాచంద్రన్, శుభాకర్ ప్రధాన పాత్రల్లో విడుదలైన 'మయూరి' సినిమాకు వచ్చేసరికి భారతీయ సంగీతం పట్ల ఆయనకున్న అవగాహన, మమకారం, అభిమానం ప్రతి పాటలోనూ మనకు వినిపిస్తుంది. ఒక్కోపాట ఒక్కో ధోరణిలో సాగుతుంది. పాటలా సాగుతుంటే ఒక చోట బెంగాలీ సంగీతంలో ఒక భాగమైన గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించిన 'రవీంద్ర సంగీత్' ఛాయలు వినిపిస్తాయి. ఇదేదో బాగుంది కదా అని వింటుంటే తెలుగు పల్లెల్లో జానపదం వినపడి గుండె ఝల్లుముంటుంది.

జంధ్యాల గారి దర్శకత్వంలో  'పడమటి సంధ్యారాగం' సినిమాలో బాలసుబ్రహ్మణ్యంగారు స్వయానా రచించిన, స్వరపరిచి, గానం చేసిన ఓ ఇంగ్లీషు పాటకు దీటుగా సినిమాలో విజయశాంతిని ఆరాధించే ఓ విదేశీయుడిగా ప్రముఖ డ్రమ్మర్ శివమణి అభినయం చాలా బాగుంటుంది.

విజయబాపినీడు గారి డైరెక్షన్‌లో చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన 'మగధీరుడు' అనే సినిమాక్కూడా ఆయన స్వరాలందించినట్టు గుర్తు.

బాపు గారి దర్శకత్వంలో శోభన్ బాబు, సుహాసిని జంట 'జాకీ' అనే సినిమాకు కూడా బాలు గారు సంగీతం అందించారు. ఆ సినిమాలో ఎస్.జానకి గారు ఆలపించిన 'అలా మండిపడకే జాబిలి' పాటలో మాధుర్యంతో కూడిన నాయిక మనోవేదన రేడియోలో విన్నా మన కళ్ళకు కడుతుంది.

ఆ తర్వాత ఎం.వి.రఘుగారి డైరెక్షన్‌లో 'కళ్ళు' సినిమాకు వచ్చేసరికి ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు స్వయంగా రాసి పాడిన 'తెల్లారింది లెగండో కొక్కొరోకో' పాటను బాలసుబ్రహ్మణ్యంగారు స్వరపరిచిన వైనం మనలోని పామరుడ్ని తట్టి లేపుతుంది.

అనంతరం నాగార్జున, విజయశాంతి జంటగా ఉప్పలపాటి నారాయణరావుగారి దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన 'జైత్రయాత్ర' సినిమాకు కథానుగుణంగా, సన్నివేశాలపరంగా సంగీతం అందించిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు తాను అన్ని రకాల సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగలనని నిరూపించుకున్నారు.


నావరకు వచ్చేసరికి బాలుగారి మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందిన పాటలు భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అదెలాగంటే నేను సీరియస్‌గా గాయకుడు లేదా గాయకురాలి గాత్రం వింటూ ఉంటానా.. ఈ లోగా ఎక్కడి నుంచో ఓ వేణువో, సన్నాయో, అప్పుడప్పుడు అకార్డియన్ వాయిద్యం నుంచి సంగీతం అలా ఊడిపడి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటుంది.

ఇన్నేళ్ళ కాలంలో, బాలు సుబ్రహ్మణ్యంగారి సంగీత దర్శకత్వంలో నేను విన్న పాటల్లో, నేను గమనించింది ఏమిటంటే వారికి పియానో, ఫిడేలు, ఢోలక్, కాంగో డ్రమ్స్ అంటే ఎక్కువ ఇష్టమని.

నాకిష్టమైన సంగీత దర్శకుల్లో ఒకరైన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వారికివే నా జన్మదిన శుభాకాంక్షలు

--- మహేష్ ధూళిపాళ్ళ