3/02/2023

మమ్ముట్టి పగటికల

 ఎండాకాలం అదీ మిట్టమధ్యాహ్నం మంచి నిద్రలో ఉన్నప్పుడు, మనింట్లోకి పర పురుషుడెవరో వచ్చి, కొద్దికాలం క్రితం చనిపోయిన లేదా అదృశ్యమైపోయిన మనింట్లో కొడుకులాగానో, భర్తలాగానో, తండ్రిలాగానో ప్రవర్తిస్తుంటే మనకెలా ఉంటుంది? అదేసమయంలో అతడి భార్యా పిల్లలు అతడ్ని వెదుక్కుంటూ వచ్చి.. అతడి ప్రవర్తన చూసి తల్లడిల్లిపోతుంటే రెండు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? చివరికి ఏం చేయాలి? అచ్చం మన మధ్య లేకుండా పోయిన మనవాడిలాగానే ప్రవర్తిస్తున్న అపరిచితుని మన ఇంట్లో అలాగే శాశ్వతంగా ఉండనివ్వలా? మందో మాకో పెట్టి అతడికి స్పృహ లేకుండా చేసి. భార్యా పిల్లలకు అప్పగించేసి శాశ్వతంగా వదిలించేసుకోవాలా? 





మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన *నన్‌పకల్ నేరతు మయక్కమ్ - Nanpakal Nerathu Mayakkam అనే మలయాళం సినిమా పైన చెప్పిన ఆసక్తికరమైన కథతో ఇటీవల ఓటీటీలో విడుదలైంది. నేను తెలుగు డబ్బింగ్ చూశాను. నాకు నచ్చిందీ సినిమా. సినిమా సంగతులు మీతో పంచుకుంటున్నాను. సినిమా టైటిల్‌ను తెలుగులో చెప్పాలంటే పగటికల అనే అర్థం వస్తుంది. 

కేరళకు చెందిన మమ్ముట్టి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి, మొక్కులు తీర్చుకోవడానికి, తమిళనాడులో వేలాంకిణి మాత దేవాలయానికి ఒక మినీ బస్సు మాట్లాడుకొని వెళ్తారు. బస్సు డ్రైవర్‌ను కంట్రోల్లో పెట్టడంతో పాటుగా యాత్రకు సంబంధించిన ఖర్చు వ్యవహారం అంతా మమ్ముట్టి చూసుకుంటూ ఉంటాడు. బస్సులో తమిళ పాటలు పెడితే ఊరుకోడు. పట్టుపట్టి మరీ మలయాళం పాటలు పెట్టించుకుంటాడు. తమిళం వాసన అస్సలు పడదు. 

మొత్తానికి అందరూ యాత్ర ముగించుకొని, మినీ బస్సులో కేరళకు తిరుగు ప్రయాణం అవుతారు. మిట్టమధ్యాహ్నమవుతుంది. బస్సులో అందరూ మంచి నిద్రలో ఉంటారు ఒక్క డ్రైవర్‌ తప్ప. ఉన్నట్టుండి మమ్ముట్టి నిద్ర లేస్తాడు. బస్సుల్లో నుంచి బైటకు చూస్తాడు. తమిళనాడులో పచ్చని పంటపొలాల మధ్య దూరాన ఉన్న ఒక పల్లెటూరు కనిపిస్తుంది. డ్రైవర్‌ను బస్సు ఆపమంటాడు. అలా వెళ్లొస్తానని చెప్పి, బస్సు దిగుతాడు మమ్ముట్టి. బస్సులో అందరూ నిద్రపోతుండగా ఆ పల్లెటూర్లోకి బాగా తెలిసినవాడిలాగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. 



అలా వెళ్ళి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగుతాడు. పక్కనే నీడన కట్టేసి ఉన్న దూడకు కాస్త పచ్చగడ్డి వేస్తాడు. కుక్కను పలకరిస్తాడు. బట్టలు మార్చుకుంటాడు. ఇంట్లోకి నిర్భయంగా ప్రవేశిస్తాడు. ఇంటి పెద్దాయన అయిన ఒక ముసలాయన ఇంటి వసారాలో పడుకొని ఉంటాడు. ఆ పెద్దాయన భార్య, కళ్ళకు ఆపరేషన్ జరిగినట్టు నల్ల కళ్లజోడు పెట్టుకొని అక్కడే కాళ్ళు చాపుకొని, గుంజకు ఆనుకొని కూర్చొని ఉంటుంది. టీవీలో పాత తమిళ సినిమా చూస్తూ ఉంటుంది. లోపల గదిలో నుదుటన బొట్టు లేని ఒక మధ్యవయస్కురాలు దిగులుగా మంచం మీద పడుకొని ఉంటుంది. 

మమ్ముట్టి నేరుగా గదిలోకి వచ్చి, దిగాలుగా పడుకొని ఉన్న ఆ మధ్యవయస్కురాలిని తమిళంలో పలకరిస్తాడు. కాఫీ పెట్టిస్తాను అంటూ వంటింట్లో వెళ్తాడు. చక్కెర, కాఫీపొడి లేకపోవడం చూసి చిరాకు పడతాడు. ఆమె ఇంటికి వచ్చిన అపరిచితుడ్ని వింతగా చూస్తుంటుంది. సామాన్లు తెస్తానని చెప్పి సంచి తీసుకొని ఇంటి బైటకు వస్తాడు. అక్కడే ఉన్న టీవీఎస్ పిఫ్టీ మోపెడ్‌ను నడుపుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోతాడు. 

ఆగి ఉన్న మినీ బస్సులో వారందరూ నిద్ర లేస్తారు. ముందు సీటులో ఉండాల్సిన మమ్ముట్టి కనిపించడు. మమ్ముట్టి ఊళ్ళోకి వెళ్లిన విషయాన్ని డ్రైవర్ ద్వారా తెలుసుకుంటారు. అతడు ఎంతకీ రాకపోయేసరికి అతడిని వెదుక్కుంటూ ఊర్లోకి వస్తారు. మోపెడ్ మీద వెళుతున్న మమ్ముట్టి వెంటపడతారు. అతడు వీళ్ళంతా ఎవరో తనకు తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఆగకుండా వెళ్ళిపోతాడు ఊరి చావడి వద్దకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్న వారితో ముచ్చట్లు పెట్టుకుంటాడు. ఊరి బార్బర్ ఇంటికి వెళ్ళి అతడి ఫొటోకు దండ వేసి ఉండటం చూసి బాధపడతాడు. సారాయి కొట్టుకు వెళతాడు. అక్కడ టీవీలో వస్తున్న తమిళ సినిమాలో డైలాగులను మక్కీకి మక్కీ చెబుతూ అక్కడి మిగతా తాగుబోతులను అలరిస్తాడు. 



ఇంతలో కేరళకు చెందిన మమ్ముట్టి భార్యా కొడుకుతో పాటుగా మినీ బస్సులో వారందరూ, నుదుట బొట్టు లేని మధ్యవయస్కురాలి ఇంటికి వస్తారు. రెండేళ్ళ క్రితం అదృశ్యమైపోయిన లేదా చనిపోయిన ఆమె భర్త సుందరంలా మమ్ముట్టి వ్యవహరిస్తున్నాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఉన్న ముసలాయన, ముసలావిడల కొడుకు సుందరం. సుందరానికి, ఆమెకు స్కూలుకు వెళుతున్న ఒక కూతురు ఉంటుంది. విషయం తెలిసి ఊరి జనమంతా ఆ ఇంటిదగ్గర చేరతారు. 

ఈలోగా మమ్ముట్టి మోపెడ్ మీద ఇంటికి వస్తాడు. కేరళకు చెందిన భార్యను, కొడుకును గుర్తుపట్టడు. తనను నిలదీసిన ఊరి వాళ్లతో, బంధువులతో ఇది తన వూరే అంటాడు మమ్ముట్టి. చచ్చేదాకా ఇక్కడే ఉంటానని తేల్చి చెబుతాడు. ఊరి పెద్ద వచ్చి సర్దిచెబుతాడు. అందరి కళ్ళు మమ్ముట్టి పైనే ఉంటాయి.. ఇంట్లోకి వెళతాడు మమ్ముట్టి. వసారాలో కాళ్లు చాపుకొని టీవీ చూస్తున్న ముసలావిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. ఆమె ప్రేమతో అతడి తల నిమురుతుంది. మధ్యవయస్కురాలు మామగారికి, మమ్ముట్టికి భోజనం వడ్డిస్తుంది. భోజనం చేయబోతూ కూతుర్ని పిలుస్తాడు. ఎప్పుడూ తనతోపాటు కూర్చొని తినే కూతురు ఇవాళ ఎందుకు రాలేదని అడుగుతాడు. మధ్యవయస్కురాలి కూతురు కన్నీళ్ళు తుడుచుకుంటూ వచ్చి మమ్ముట్టి వెనుక కూర్చుంటుంది. 

మమ్ముట్టి భార్యా బంధువులు ఒక నిర్ణయానికి వస్తారు. అతడికి మత్తుమందు పెట్టి అతడిని తమతోపాటు కేరళకు తీసుకువెళ్ళానని అనుకుంటారు. మత్తుమందును మధ్యవయస్కురాలికి ఇస్తారు. అయితే మధ్యవయస్కురాలు మత్తు మందును కాఫీలో కలపకుండా వదిలేస్తుంది. 

ఆ తర్వాత ఏమైంది? మరి మమ్ముట్టి మాములు వాడైపోయాడా? అతడిని ఆవహించిన సుందరం అతడిని వదిలేశాడా? లేక అలాగే ఉండిపోయాడా? మమ్ముట్టి తన వారితో కలిసి కేరళకు వెళ్లాడా? లేదా? తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. 

మొదటి పావుగంట సినిమా కొంత సాగదీసినట్టుగా అనిపించినా.. మిగిలిన గంటన్నర సినిమా, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. టీవీలో వస్తున్న పాత తమిళ సినిమాలో సంభాషణలను, పాటలను, నేపథ్య సంగీతాన్ని ఈ సినిమాకు సందర్భోచితంగా వాడుకున్నాడు దర్శకుడు. సినిమా చిత్రీకరణ అంతా దివంగత తమిళ దర్శకుడు. ఛాయాగ్రహకుడు బాలూ మహేంద్ర తరహాలోనే ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్‌ ప్రధాన పాత్రదారిగా, తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో, దాదాపు మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ నన్‌పకల్ నేరతు మయక్కమ్ - Nanpakal Nerathu Mayakkam సినిమాకు మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 

వీలుంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. మిగతా సినిమాల్లా కాకుండా, ఈ సినిమాను కాస్త మనసు పెట్టి చూస్తే మజా వస్తుంది. 

మహేష్ ధూళిపాళ్ళ

9441442550

7/18/2020

Yedhi Samasya Yedhi Sanghatana (video)

Yedhi Samasya Yedhi Sanghatana is a video about classification of happenings in society to issues and incidents.

It discusses various happenings from Indian Freedom Struggle, Green Revolution, Bihar Movement led by Jayaprakash Narayan, Assasination of Indira Gandhi, Rajiv Gandhi and so on. The language is Telugu.

Yedhi Samasya Yedhi Sanghatana

7/11/2020

ఆర్‌.డి. బర్మన్, కీరవాణి.. పక్కన మణిశర్మ


1997 నాటి ముచ్చట. నెల్లూరులో ఉండగా ఈనాడులో పనిచేస్తున్న ఓ మిత్రుడు 'సూపర్ హీరోస్' ఆడియో క్యాసెట్ తెచ్చిచ్చాడు. అప్పట్లో ఆ సినిమా క్యాసెట్ల పంపిణీ బాధ్యతలు ఉషా కిరణ్ మూవీస్ వారు తీసుకున్నారనుకుంటా. హాస్య నటుడు ఏవీఎస్‌కు దర్శకుడిగా అది తొలి చిత్రం. నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్. మణిశర్మ అన్ని పాటలతో పాటుగా నేపథ్య సంగీతం అందించిన తొలి సినిమా.
 
ప్రముఖ సంగీత దర్శకులు జి.కె.వెంకటేష్ ఏ రకంగా అయితే 'అమెరికా అమ్మాయి' చిత్రానికి వేర్వేరు సంగీత రీతుల్లో పాటలు స్వరపరిచారో.. మణిశర్మ కూడా ఈ చలనచిత్రానికి అంతే కష్టపడ్డారు.

కానీ బ్రహ్మానందం, ఏవీఎస్ కథానాయకులుగా విడుదలైన 'సూపర్ హీరోస్' చిత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. దానివల్ల మణిశర్మ నష్టపోయిందేమీ లేదు. ఎందుకంటే పునాది గట్టిది కదా.

అదెలాగంటే అంతకు ఐదేళ్ళ ముందు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'రాత్రి' కి నేపథ్య సంగీతం, 'అంతం' సినిమాకు ఓ పాట స్వరపరిచారు మణిశర్మ. అప్పట్లో ఆడియో క్యాసెట్ల అట్ట కవరు మీద ప్రతిపాటకూ గాయనీగాయకులు, గీత రచయితలు, సంగీత దర్శకుల పేర్లు ముద్రించేవారు.

ఆ క్రమంలో నాగార్జున, ఊర్మిళ, సలీమ్ గౌస్ (కథానాయిక అన్న పాత్రధారి) నటించిన 'అంతం' సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం అప్పట్లో పెద్ద సంచలనం.


ఆ ముగ్గుర్లో ఒకరు హిందీ సినిమాల సంగీత రారాజు ఆర్‌డి బర్మన్, మరొకరు ఘరానా మొగుడు లాంటి విజయాలు ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి కాగా మూడో సంగీత దర్శకుడు మణిశర్మ. అలా సినీ జనాల దృష్టిలో పడ్డారు మణిశర్మ.

చిరంజీవితో తొలిసారి చేసిన 'బావగారూ బాగున్నారా' సినిమా మణిశర్మకు పెద్ద కథానాయకుల సంగీత దర్శకుడు అన్న పేరు తీసుకొచ్చింది.

నెల్లూరులో అర్చనలోనో నర్తకి టాకీస్‌లోనో ఆ సినిమా చూశాను. అప్పుడే బీపీఎల్ కంపెనీ సీడీ ప్లేయర్ కొన్నాను.

అంతటితో ఆగకుండా తన ప్రతి సినిమాలోనూ మాధుర్యంతో కూడుకున్న ఒక పాట ఉండేలా చూసుకునేవారు మణిశర్మ.

ఎ.ఆర్.రెహ్మాన్ రెచ్చిపోతున్న రోజులవి. ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి, ఇళయరాజాల స్వరాలకు ప్రేక్షకులు తలలూపడం తగ్గించుకుంటున్న కాలమది. కారణమేంటో తెలీదు కానీ నేరుగా తెలుగు సినిమాలకు రెహ్మాన్ సంగీతం అంతగా అచ్చిరావడంలేదు.

సినీ జనమంతా ఉర్రూతలూగించే సినీ సంగీతపు లోటును అనుభవిస్తున్న సమయంలో 'సమరసింహారెడ్డి' వచ్చింది. ఒంగోలు విజయదుర్గ హాల్లో చూశాను.

గతంలో బాలకృష్ణ సినిమాలకు అద్బుతమైన సంగీతం అందించిన కె.వి.మహదేవన్. చక్రవర్తిల శైలిని ఔపోసన పట్టినట్టున్నారు మణిశర్మ. మరీ ముఖ్యంగా చక్రవర్తిలా చక్రం తిప్సేసారు. ఒక్కోపాట బ్రహ్మాండంగా వచ్చింది.

మట్టి తోలుకువెళ్ళే ట్రాక్టర్ల నుంచి బెంజి కార్ల దాకా ఎక్కడ చూసినా సమర సింహారెడ్డి పాటలే. అలా ఆ ఇద్దరు గొప్ప సంగీత దర్శకుల ఖాళీని భర్తీ చేశారు మణిశర్మ.

ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ గణేష్ సినిమాలో తండ్రి, చెల్లెలుతో కథానాయకుడి పాట, మహేష్ బాబు మురారి సినిమాలో పెళ్ళి ఏర్పాట్ల పాట లాంటివి ఎన్నో ఉన్నాయి. నాకైతే వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమాలో 'నేరేడే పళ్ళు.. నీ నీలాల కళ్ళు' పాట అంటే మరీ మరీ ఇష్టం.

చివరిగా.. తెలుగువారు మా సంగీత దర్శకుడు అని గర్వంగా చెప్పుకునే సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు.

(జులై 11. సంగీత దర్శకుడు మణిశర్మ జన్మదినం)

--- మహేష్ ధూళిపాళ్ళ

7/03/2020

స్పష్టాస్పష్ట ప్రేమకథా చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'


సినిమా వాళ్ళు ఏ భాషకు చెందినవారైన కావొచ్చు ప్రేమ కథలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేపథ్యాలను ఎంచుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఆ కోవకు చెందినదే అమెజాన్ ప్రయిమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై జులై మూడవ తేదీన విడుదలైన మలయాళ చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'.

ఇదొక మాటలు రాని కథక్ నాట్యకారిణి సుజాత (అదితిరావు హైదరీ), సూఫీ (దేవ్ మోహన్) మధ్య నడిచే ప్రేమకథ.

ఈ ప్రేమ కథకు సుజాత భర్త రాజీవ్ (జయసూర్య) ఏ మేరకు స్పందించాడనే కథ పూల దండ మధ్య దారంలా అంతర్లీనంగా సాగుతుంది.

చుట్టూ ఆకుపచ్చని కొండలు, చెప్పులు విప్పి చేత పట్టుకుంటే కానీ మానవమాత్రులకు దాటడం సాధ్యం కాని ఓ నది, పాతకాలపు సూఫీ (ముస్లిం) ప్రార్థనా మందిరం, పక్షులతో కళకళాలాడుతూ ఇప్పుడిప్పుడే పట్టణ శోభను సంతరించుకుంటున్న ఓ పల్లెటూరు చిత్ర కథకు ఓ చక్కని వేదికగా అమరింది.

సుజాత ఓ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన 22 ఏళ్ళ యువతి. బధిరురాలైనప్పటికి అందరూ చెప్పేవి వినపడుతుంటాయి. చక్కగా నాట్యం చేస్తుంది. పిల్లలకు నాట్య పాఠాలు చెబుతుంటుంది.

తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి సంబంధం చూస్తుంటారు. దుబాయ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే డాక్టర్ రాజీవ్‌తో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.

సరిగ్గా ఇలాంటప్పుడే ఆ ఊరికి ఓ సూఫీ వస్తాడు. మునివేళ్ళపై నిలుచుండి నాట్యం చేయడం ద్వారా సుజాతను ఆకట్టుకుంటాడు. ఇద్దరూ ఎక్కడి కన్నా పారిపోదామనుకుంటారు. అందుకు గుండెలు బాదుకుంటూ తండ్రి అడ్డు చెప్పడంతో సుజాత ఆగిపోతుంది. సూఫీ కనిపించకుండాపోతాడు.

సూఫీ ఇచ్చిన జపమాల సుజాత దగ్గరే ఉండిపోతుంది. ఆ తర్వాత రాజీవ్‌‌ను వివాహం చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతుంది. ఓ కూతుర్ని కంటుంది.

అంతా బాగున్నదని భావిస్తున్న సమయంలో ఊరి నుంచి వచ్చిన ఓ కబురు సుజాత, రాజీవ్‌లను ఉన్నపళంగా ఊరికి చేరుస్తుంది. ఆ తర్వాత జపమాల చుట్టే కథ అంతా తిరుగుతుంది.

ఇంతకన్నా ఎక్కువగా చెబితే సబ్ టైటిల్స్‌తో సినిమా చూడాలనుకునేవారికి చూడాలనే ఆసక్తి చచ్చిపోయే అవకాశం ఉంది.

సినిమా అంతా సన్నాయి(క్లారినేట్) వినపడుతుంటుంది. దానికి తోడుగా అక్కడక్కడా కాసిని ఫిడేలు, గిటారు రాగాలు, తబలా, ఢోలక్ దరువులు ప్రేక్షకులను సినిమా వెంట తీసుకువెళతాయి. ఈ విషయంలో సంగీత దర్శకుడు ఎం జయచంద్రన్‌కు పెద్ద పీట వేయాలి.

రెండు గంటల రెండు నిముషాల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నరనిపుళా షానవాస్.. చిత్రానికి కీలకమైన ప్రేమ సన్నివేశాలను స్పష్టాస్పష్టంగా తీర్చిదిద్దడం వింత గొలుపుతుంది. బహుశా ఈ స్పష్టాస్పష్టత కారణంగానే సినిమాకు 18 ప్లస్ రేటింగ్ ఇచ్చినట్టున్నారు.

సూఫీ ప్రార్థనకు సుజాత చేసే కథక్ నృత్యం రసహృదయులైన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆమె గదిలో గోడకు తగిలించిన ఫ్రేములో బిస్మిల్లా ఖాన్ చిత్రపటం దర్శకుడి అభిరుచికి నిదర్శనం. 

చివరగా.. తెలుగులో వచ్చిన శోభన్ బాబు 'కళ్యాణ తాంబూలం', జగపతి బాబు 'ప్రియరాగాలు', అల్లరి నరేష్ 'ప్రాణం' సినిమా తరహాలో మలయాళ 'సూఫియుమ్ సుజాతయుమ్' సినిమా ఓ  'దృశ్య'కావ్యం మాత్రమే.

--- మహేష్ ధూళిపాళ్ళ

6/22/2020

ఆయన మాటలు.. ఆడవాళ్ళకు మాత్రమే..!

ఒక సినిమా వెనుక ఎవరెవరు ఉంటారా అనే ఇంట్రెస్ట్ పుడుతున్న రోజుల్లో 'స్వాతి' సినిమా వచ్చింది.

తల్లికి కూతురు పెళ్ళి చేయడమనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఆ సినిమా అప్పట్లో దుమ్ములేపింది.

మహిళలంతా థియేటర్ల ముందు క్యూ కట్టారు. వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని టికెట్లు సంపాదించుకోవడంలో మగాళ్లు కనిపించేవారు. 

క్రాంతి కుమార్ డైరక్షన్‌లో వచ్చిన ఆ సినిమాకు గణేశ్ పాత్రో డైలాగులు రాశారు. తల్లిగా శారద, కూతురుగా సుహాసిని పోటీపడి మరీ నటించారు. కంచుకంఠం జగ్గయ్య, కపిల్ దేవ్ ఫ్యాన్ సంయుక్త, శుభలేఖ సుధాకర్ సంగీత కచ్చేరీకి పక్క వాయిద్యాల్లా సినిమాకు పనికి వచ్చారు. స్వాతికి కాసిని అవార్డులు కూడా వచ్చాయనుకుంటా.

అప్పట్లో సినిమాల డైలాగ్ క్యాసెట్లు కొనుక్కొని ఇళ్లల్లో, టీ స్టాళ్లు, కాకా హోటళ్ళ దగ్గర వినడమంటే జనాలకు మహా ఇష్టంగా ఉండేది. ఎన్టీఆర్, ఎఎన్నార్‌లను దాటి చిరంజీవి 'న్యాయం కావాలి' సినిమా తర్వాత జనాలు అలా డైలాగులు వినడంలో 'స్వాతి' శభాష్ అనిపించుకుంది.

'స్వాతి' హిట్ ప్యాకెట్‌‌లో వేసుకున్న క్రాంతి కుమార్, గణేశ్ పాత్రో జోడీ అదే ఊపు మీద సుహాసినితో 'స్రవంతి' అనే సినిమా తీశారు. 'మైక్' మోహన్, శరత్ బాబు సపోర్టింగ్ యాక్టర్లు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఇచ్చారు. అయినా కానీ 'స్వాతి' రేంజ్‌లో ఆడలేదు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బాలచందర్ డైరక్షన్ లో వచ్చిన 'మరో చరిత్ర' నుంచి కాంత్రికుమార్ తీసిన 'తొమ్మిది నెలలు' సినిమా దాకా ఆడవాళ్ళను సపోర్ట్ చేస్తూ ఏవైనా సినిమాలు వస్తే వాటికి స్టోరీ, డైలాగులు లేకుంటే డైలాగులు గణేశ్ పాత్రోనే రాసుంటారు అనే ధీమాతో నాలాంటి వాళ్ళు థియేటర్లకు వెళ్ళేవారు కాబట్టి.

బాలకృష్ణ దగ్గరికి వచ్చేసరికి 'ముద్దుల కృష్ణయ్య' లాంటి సినిమాలకు డైలాగులు రాసి ఎలాంటి డైలాగులైనా రాస్తానని నిరూపించుకున్నారు పాత్రో.

చిరంజీవి 'రుద్రవీణ' కూ గణేష్ పాత్రో డైలాగులే. ఈ సినిమాలోనూ లేడీస్‌కు పెద్దపీట వేశారు పాత్రో. వీలుంటే ఓసారి ఆ సినిమా చూడండి లేదంటే గుర్తు చేసుకోండి. హీరోయిన్ శోభనక్కానీ, హీరో వదిన ప్లస్ భావోద్వేగాలు ఆపుకోలేక నాదస్వరం వాయించే ప్రసాద్‌బాబు భార్యకు పాత్రో రాసిన డైలాగులు సందర్భోచితంగా ఉంటాయి.

జీవిత హీరోయిన్‌గా, రాజశేఖర్ విలన్‌గా అన్యాయమైపోయిన అబల గురించి కోడిరామకృష్ణ తీసిన 'తలంబ్రాలు' సినిమాక్కూడా డైలాగులిచ్చారు పాత్రో.

మాటలు నింపితే చాలు సినిమా పాటలైపోతున్న రోజుల్లో నాగార్జున 'నిర్ణయం' సినిమాకు 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' అనే పాటతో నేను పాటలు కూడా రాయగలను సుమా అని ప్రూవ్ చేసుకున్నారు.

'మరో చరిత్ర' సినిమాలో హైదరాబాద్ చేరుకున్న కమల్ హాసన్.. ఫ్రెండ్‌తో కలిసి మందు పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ పార్టీలో ఒకడిగా గ్లాసు పట్టుకున్న పాత్రలో పాత్రో మనకు కనిపిస్తారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా అక్కడక్కడా అలా మెరిసి ఇలా మాయమైపోతారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాక్కూడా ఆయనే రాశారు. కానీ చిన్నప్పటినుంచి ఆయన మాటలు వినీవినీ ఉండటం వల్ల, గణేశ్ పాత్రో స్టామినాతో పోల్చినప్పుడు నిజం చెప్పాలంటే పొడి పొడి మాటలతో, గుండె తడి చెమ్మ తగలని ఆ సినిమా డైలాగులు నాకు అంతగా ఎక్కలేదు. అయితే ఆయనిచ్చిన ఫినిషింగ్ టచ్‌తోనే సినిమా నిలబడిందని నాకు తెలిసిన కొందరు సినీజనాలు చెబితే.. దటీజ్ గణేశ్ పాత్రో అని మురిసిపోవడం నా వంతుగా మారింది.

సినిమా డైలాగుల గురించి అనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు గుర్తుకొస్తాను సుమా.. అంటూ కనిపించకుండా పోయిన గణేశ్ పాత్రో నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉంటారు.

(జూన్ 22: నాటకాలు, సినిమాల రైటర్ గణేశ్ పాత్రో జయంతి.)

--- మహేష్ ధూళిపాళ్ళ

6/19/2020

'అబ్బాయిగారు'.. ఎంత పనిచేశారు?



టైటిలు అబ్బాయిగారు, వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లు; కథ కె భాగ్యరాజా, డైలాగులు జంధ్యాల, డైరెక్షను ఇవివి సత్యనారాయణ.

వాట్టే కాంబినేషన్ అనుకున్నారు జనం.

ఫస్ట్ రోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో మార్నింగ్ షో చూసి బైటకు రాగానే సినిమాకు మంచి టాక్.

దాన్తో పాటు ఓ సైడు టాకు. "అసలు జంధ్యాల ఏమిటి.. ఇలా డబుల్ మీనింగు డైలాగులు రాయడమేటి?" అని.

ఈ సైడు టాకు ఏ రేంజ్‌కు చేరుకుందంటే.. ఓ రోజు జంధ్యాలగారు ప్రెస్ వాళ్ళను పిలిచి "ఆ డైలాగులు నావి కావు" అని క్లారిటీ ఇచ్చేదాకా.



++       ++   ++   ++

టైటిలు భారతీయుడు, కమల్ హాసన్ డబుల్ యాక్షన్, శంకర్ డైరెక్షన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్కు.

కథ అంటే కరప్షన్ మీద ఓ ఫ్రీడమ్ ఫైటర్ చేసే ఫైటు. క్లయిమాక్సులో కన్న కొడుకును ఖతం చేసేసిన పెద్ద కమల్ హాసన్ ఫ్లయిట్ ఎక్కేసి ఫారిన్ చెక్కేస్తాడు. అక్కడ్నుంచి ఇండియాలో ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన వారు 'ఎవరు మాట్లాడేది' అని అడగ్గానే 'భారతీయుడు' అని పెద్ద కమల్ హాసన్ స్టయిల్‌గా చెప్తాడు. తెర కిందకు దిగుతుండగా జనం హాల్లోంచి బైటకు వచ్చేస్తారు.

సినిమా తెగ ఆడేస్తోంది. ఎక్కడ చూసినా ఆ సినిమా సంగతులే.  అదే టైమ్‌లో జంధ్యాల గారు ఓ వార పత్రికలో వారం వారం పాఠకుల ప్రశ్నలకు జవాబులిస్తున్నారు. అందులో ఒకటి ఇలా ఉంది..

ప్రశ్న: 'భారతీయుడు' సినిమా గురించి మీ అభిప్రాయం?

జంధ్యాల: ఫారిన్ పారిపోయిన 'భారతీయుడు' గురించి ఏం చెప్పమంటారు?

(రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ జంధ్యాలగారి వర్థంతి ఈ రోజు జూన్ 19న)

---- మహేష్ ధూళిపాళ్ళ

6/16/2020

అన్ని రోజులూ.. అవే పాటలు..!

'డిస్కో డ్యాన్సర్' సినిమా రిలీజైన రోజులవి. నేనప్పుడు ఒంగోల్లో ఓరియంటల్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాను. వేరే స్కూల్ వాళ్ళు బెంగళూరు, మైసూరు, విజయనగరం(కర్ణాటక), శ్రావణ బెలగోళ లాంటి కర్ణాటకలో పేరున్న ప్రాంతాలకు బస్ ట్రిప్ వేశారు.

అదెలా కుదిరిందో తెలీదు కానీ నేను మా అన్నయ్య కూడా ఆ ట్రిప్‌లో మెంబర్స్ అయిపోయాం. బస్సు రాత్రిపూట ఒంగోల్లో గంగాణమ్మ లేదా గంగాళమ్మ  గుడి దగ్గర నుంచి బయలుదేరింది. లైఫ్‌లో మొట్టమొదటిసారి లాంగ్ టూర్‌కు వెళడం.

క్లీనరు క్యాసెట్ ప్లేయర్ పెట్టాడు. 'ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్' అని పాట మొదలైంది. ఓ అరగంట గడిచాక నిద్రపోవడానికని పాటలు కట్టేశాడు క్లీనరు.

పొద్దున లేచాం. ఏ ఊరో తెలీదు. ఏదో దేవాలయం దగ్గర బస్సు ఆపాడు డ్రైవరు. అందరం కాలకృత్యాలు తీర్చుకున్నాం. వంటవాళ్ళు బస్ టాప్ మీదున్న సామాన్లన్నీ దింపి బొంబాయి రవ్వ ఉప్మా, శెనగపప్పు చెట్నీ చేశారు.

అంతా అయిపోయాక బస్సు ఎక్కాం. బస్సు ఎక్కగానే 'జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా' అంటూ మళ్ళీ 'డిస్కో డ్యాన్సర్' పాటలు మొదలయ్యాయి. రాత్రి క్యాసెట్ మిగిలిపోతే పెట్టాడేమో అనుకున్నాను.

కానీ 'డిస్కో డ్యాన్సర్' పాట కచ్చేరీ అక్కడితో ఆగిపోలేదు. టూర్ ఎన్నిరోజులు జరిగిందో గుర్తు లేదు కానీ, కర్ణాటక అంతా తిరిగి తిరిగి.. తిరిగి ఒంగోలు వచ్చేదాకా అవేపాటలు వేస్తూనే ఉన్నాడు. మేమంతా వింటూనే ఉన్నాము.

ఆ పాటలకు బస్సులో ఉన్న ప్రయాణికులమంతా ఎంతలా కనెక్ట్ అయ్యామంటే.. ' ఏ ఒక్కరూ ఇక ఆపరా బాబూ..' అని అనకపోవడం విశేషం.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే 'డిస్కో డ్యాన్సర్' హీరో మిథున్ చక్రవ(బ)ర్తి బర్త్ డే ఈ రోజు (జూన్ 16).

--- మహేష్ ధూళిపాళ్ళ