1997 నాటి ముచ్చట. నెల్లూరులో ఉండగా ఈనాడులో పనిచేస్తున్న ఓ మిత్రుడు 'సూపర్ హీరోస్' ఆడియో క్యాసెట్ తెచ్చిచ్చాడు. అప్పట్లో ఆ సినిమా క్యాసెట్ల పంపిణీ బాధ్యతలు ఉషా కిరణ్ మూవీస్ వారు తీసుకున్నారనుకుంటా. హాస్య నటుడు ఏవీఎస్‌కు దర్శకుడిగా అది తొలి చిత్రం. నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్. మణిశర్మ అన్ని పాటలతో పాటుగా నేపథ్య సంగీతం అందించిన తొలి సినిమా.
ప్రముఖ సంగీత దర్శకులు జి.కె.వెంకటేష్ ఏ రకంగా అయితే 'అమెరికా అమ్మాయి' చిత్రానికి వేర్వేరు సంగీత రీతుల్లో పాటలు స్వరపరిచారో.. మణిశర్మ కూడా ఈ చలనచిత్రానికి అంతే కష్టపడ్డారు.
కానీ బ్రహ్మానందం, ఏవీఎస్ కథానాయకులుగా విడుదలైన 'సూపర్ హీరోస్' చిత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. దానివల్ల మణిశర్మ నష్టపోయిందేమీ లేదు. ఎందుకంటే పునాది గట్టిది కదా.
అదెలాగంటే అంతకు ఐదేళ్ళ ముందు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'రాత్రి' కి నేపథ్య సంగీతం, 'అంతం' సినిమాకు ఓ పాట స్వరపరిచారు మణిశర్మ. అప్పట్లో ఆడియో క్యాసెట్ల అట్ట కవరు మీద ప్రతిపాటకూ గాయనీగాయకులు, గీత రచయితలు, సంగీత దర్శకుల పేర్లు ముద్రించేవారు.
ఆ క్రమంలో నాగార్జున, ఊర్మిళ, సలీమ్ గౌస్ (కథానాయిక అన్న పాత్రధారి) నటించిన 'అంతం' సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం అప్పట్లో పెద్ద సంచలనం.
ఆ ముగ్గుర్లో ఒకరు హిందీ సినిమాల సంగీత రారాజు ఆర్‌డి బర్మన్, మరొకరు ఘరానా మొగుడు లాంటి విజయాలు ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి కాగా మూడో సంగీత దర్శకుడు మణిశర్మ. అలా సినీ జనాల దృష్టిలో పడ్డారు మణిశర్మ.
చిరంజీవితో తొలిసారి చేసిన 'బావగారూ బాగున్నారా' సినిమా మణిశర్మకు పెద్ద కథానాయకుల సంగీత దర్శకుడు అన్న పేరు తీసుకొచ్చింది.
నెల్లూరులో అర్చనలోనో నర్తకి టాకీస్‌లోనో ఆ సినిమా చూశాను. అప్పుడే బీపీఎల్ కంపెనీ సీడీ ప్లేయర్ కొన్నాను.
అంతటితో ఆగకుండా తన ప్రతి సినిమాలోనూ మాధుర్యంతో కూడుకున్న ఒక పాట ఉండేలా చూసుకునేవారు మణిశర్మ.
ఎ.ఆర్.రెహ్మాన్ రెచ్చిపోతున్న రోజులవి. ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి, ఇళయరాజాల స్వరాలకు ప్రేక్షకులు తలలూపడం తగ్గించుకుంటున్న కాలమది. కారణమేంటో తెలీదు కానీ నేరుగా తెలుగు సినిమాలకు రెహ్మాన్ సంగీతం అంతగా అచ్చిరావడంలేదు.
సినీ జనమంతా ఉర్రూతలూగించే సినీ సంగీతపు లోటును అనుభవిస్తున్న సమయంలో 'సమరసింహారెడ్డి' వచ్చింది. ఒంగోలు విజయదుర్గ హాల్లో చూశాను.
గతంలో బాలకృష్ణ సినిమాలకు అద్బుతమైన సంగీతం అందించిన కె.వి.మహదేవన్. చక్రవర్తిల శైలిని ఔపోసన పట్టినట్టున్నారు మణిశర్మ. మరీ ముఖ్యంగా చక్రవర్తిలా చక్రం తిప్సేసారు. ఒక్కోపాట బ్రహ్మాండంగా వచ్చింది.
మట్టి తోలుకువెళ్ళే ట్రాక్టర్ల నుంచి బెంజి కార్ల దాకా ఎక్కడ చూసినా సమర సింహారెడ్డి పాటలే. అలా ఆ ఇద్దరు గొప్ప సంగీత దర్శకుల ఖాళీని భర్తీ చేశారు మణిశర్మ.
ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ గణేష్ సినిమాలో తండ్రి, చెల్లెలుతో కథానాయకుడి పాట, మహేష్ బాబు మురారి సినిమాలో పెళ్ళి ఏర్పాట్ల పాట లాంటివి ఎన్నో ఉన్నాయి. నాకైతే వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమాలో 'నేరేడే పళ్ళు.. నీ నీలాల కళ్ళు' పాట అంటే మరీ మరీ ఇష్టం.
చివరిగా.. తెలుగువారు మా సంగీత దర్శకుడు అని గర్వంగా చెప్పుకునే సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు.
(జులై 11. సంగీత దర్శకుడు మణిశర్మ జన్మదినం)
--- మహేష్ ధూళిపాళ్ళ

No comments:
Post a Comment