7/03/2020

స్పష్టాస్పష్ట ప్రేమకథా చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'


సినిమా వాళ్ళు ఏ భాషకు చెందినవారైన కావొచ్చు ప్రేమ కథలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేపథ్యాలను ఎంచుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఆ కోవకు చెందినదే అమెజాన్ ప్రయిమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై జులై మూడవ తేదీన విడుదలైన మలయాళ చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'.

ఇదొక మాటలు రాని కథక్ నాట్యకారిణి సుజాత (అదితిరావు హైదరీ), సూఫీ (దేవ్ మోహన్) మధ్య నడిచే ప్రేమకథ.

ఈ ప్రేమ కథకు సుజాత భర్త రాజీవ్ (జయసూర్య) ఏ మేరకు స్పందించాడనే కథ పూల దండ మధ్య దారంలా అంతర్లీనంగా సాగుతుంది.

చుట్టూ ఆకుపచ్చని కొండలు, చెప్పులు విప్పి చేత పట్టుకుంటే కానీ మానవమాత్రులకు దాటడం సాధ్యం కాని ఓ నది, పాతకాలపు సూఫీ (ముస్లిం) ప్రార్థనా మందిరం, పక్షులతో కళకళాలాడుతూ ఇప్పుడిప్పుడే పట్టణ శోభను సంతరించుకుంటున్న ఓ పల్లెటూరు చిత్ర కథకు ఓ చక్కని వేదికగా అమరింది.

సుజాత ఓ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన 22 ఏళ్ళ యువతి. బధిరురాలైనప్పటికి అందరూ చెప్పేవి వినపడుతుంటాయి. చక్కగా నాట్యం చేస్తుంది. పిల్లలకు నాట్య పాఠాలు చెబుతుంటుంది.

తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి సంబంధం చూస్తుంటారు. దుబాయ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే డాక్టర్ రాజీవ్‌తో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.

సరిగ్గా ఇలాంటప్పుడే ఆ ఊరికి ఓ సూఫీ వస్తాడు. మునివేళ్ళపై నిలుచుండి నాట్యం చేయడం ద్వారా సుజాతను ఆకట్టుకుంటాడు. ఇద్దరూ ఎక్కడి కన్నా పారిపోదామనుకుంటారు. అందుకు గుండెలు బాదుకుంటూ తండ్రి అడ్డు చెప్పడంతో సుజాత ఆగిపోతుంది. సూఫీ కనిపించకుండాపోతాడు.

సూఫీ ఇచ్చిన జపమాల సుజాత దగ్గరే ఉండిపోతుంది. ఆ తర్వాత రాజీవ్‌‌ను వివాహం చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతుంది. ఓ కూతుర్ని కంటుంది.

అంతా బాగున్నదని భావిస్తున్న సమయంలో ఊరి నుంచి వచ్చిన ఓ కబురు సుజాత, రాజీవ్‌లను ఉన్నపళంగా ఊరికి చేరుస్తుంది. ఆ తర్వాత జపమాల చుట్టే కథ అంతా తిరుగుతుంది.

ఇంతకన్నా ఎక్కువగా చెబితే సబ్ టైటిల్స్‌తో సినిమా చూడాలనుకునేవారికి చూడాలనే ఆసక్తి చచ్చిపోయే అవకాశం ఉంది.

సినిమా అంతా సన్నాయి(క్లారినేట్) వినపడుతుంటుంది. దానికి తోడుగా అక్కడక్కడా కాసిని ఫిడేలు, గిటారు రాగాలు, తబలా, ఢోలక్ దరువులు ప్రేక్షకులను సినిమా వెంట తీసుకువెళతాయి. ఈ విషయంలో సంగీత దర్శకుడు ఎం జయచంద్రన్‌కు పెద్ద పీట వేయాలి.

రెండు గంటల రెండు నిముషాల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నరనిపుళా షానవాస్.. చిత్రానికి కీలకమైన ప్రేమ సన్నివేశాలను స్పష్టాస్పష్టంగా తీర్చిదిద్దడం వింత గొలుపుతుంది. బహుశా ఈ స్పష్టాస్పష్టత కారణంగానే సినిమాకు 18 ప్లస్ రేటింగ్ ఇచ్చినట్టున్నారు.

సూఫీ ప్రార్థనకు సుజాత చేసే కథక్ నృత్యం రసహృదయులైన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆమె గదిలో గోడకు తగిలించిన ఫ్రేములో బిస్మిల్లా ఖాన్ చిత్రపటం దర్శకుడి అభిరుచికి నిదర్శనం. 

చివరగా.. తెలుగులో వచ్చిన శోభన్ బాబు 'కళ్యాణ తాంబూలం', జగపతి బాబు 'ప్రియరాగాలు', అల్లరి నరేష్ 'ప్రాణం' సినిమా తరహాలో మలయాళ 'సూఫియుమ్ సుజాతయుమ్' సినిమా ఓ  'దృశ్య'కావ్యం మాత్రమే.

--- మహేష్ ధూళిపాళ్ళ

No comments:

Post a Comment