7/18/2020

Yedhi Samasya Yedhi Sanghatana (video)

Yedhi Samasya Yedhi Sanghatana is a video about classification of happenings in society to issues and incidents.

It discusses various happenings from Indian Freedom Struggle, Green Revolution, Bihar Movement led by Jayaprakash Narayan, Assasination of Indira Gandhi, Rajiv Gandhi and so on. The language is Telugu.

Yedhi Samasya Yedhi Sanghatana

7/11/2020

ఆర్‌.డి. బర్మన్, కీరవాణి.. పక్కన మణిశర్మ


1997 నాటి ముచ్చట. నెల్లూరులో ఉండగా ఈనాడులో పనిచేస్తున్న ఓ మిత్రుడు 'సూపర్ హీరోస్' ఆడియో క్యాసెట్ తెచ్చిచ్చాడు. అప్పట్లో ఆ సినిమా క్యాసెట్ల పంపిణీ బాధ్యతలు ఉషా కిరణ్ మూవీస్ వారు తీసుకున్నారనుకుంటా. హాస్య నటుడు ఏవీఎస్‌కు దర్శకుడిగా అది తొలి చిత్రం. నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్. మణిశర్మ అన్ని పాటలతో పాటుగా నేపథ్య సంగీతం అందించిన తొలి సినిమా.
 
ప్రముఖ సంగీత దర్శకులు జి.కె.వెంకటేష్ ఏ రకంగా అయితే 'అమెరికా అమ్మాయి' చిత్రానికి వేర్వేరు సంగీత రీతుల్లో పాటలు స్వరపరిచారో.. మణిశర్మ కూడా ఈ చలనచిత్రానికి అంతే కష్టపడ్డారు.

కానీ బ్రహ్మానందం, ఏవీఎస్ కథానాయకులుగా విడుదలైన 'సూపర్ హీరోస్' చిత్రం ప్రేక్షకులకు నచ్చలేదు. దానివల్ల మణిశర్మ నష్టపోయిందేమీ లేదు. ఎందుకంటే పునాది గట్టిది కదా.

అదెలాగంటే అంతకు ఐదేళ్ళ ముందు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'రాత్రి' కి నేపథ్య సంగీతం, 'అంతం' సినిమాకు ఓ పాట స్వరపరిచారు మణిశర్మ. అప్పట్లో ఆడియో క్యాసెట్ల అట్ట కవరు మీద ప్రతిపాటకూ గాయనీగాయకులు, గీత రచయితలు, సంగీత దర్శకుల పేర్లు ముద్రించేవారు.

ఆ క్రమంలో నాగార్జున, ఊర్మిళ, సలీమ్ గౌస్ (కథానాయిక అన్న పాత్రధారి) నటించిన 'అంతం' సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం అప్పట్లో పెద్ద సంచలనం.


ఆ ముగ్గుర్లో ఒకరు హిందీ సినిమాల సంగీత రారాజు ఆర్‌డి బర్మన్, మరొకరు ఘరానా మొగుడు లాంటి విజయాలు ఇచ్చిన ఎం.ఎం.కీరవాణి కాగా మూడో సంగీత దర్శకుడు మణిశర్మ. అలా సినీ జనాల దృష్టిలో పడ్డారు మణిశర్మ.

చిరంజీవితో తొలిసారి చేసిన 'బావగారూ బాగున్నారా' సినిమా మణిశర్మకు పెద్ద కథానాయకుల సంగీత దర్శకుడు అన్న పేరు తీసుకొచ్చింది.

నెల్లూరులో అర్చనలోనో నర్తకి టాకీస్‌లోనో ఆ సినిమా చూశాను. అప్పుడే బీపీఎల్ కంపెనీ సీడీ ప్లేయర్ కొన్నాను.

అంతటితో ఆగకుండా తన ప్రతి సినిమాలోనూ మాధుర్యంతో కూడుకున్న ఒక పాట ఉండేలా చూసుకునేవారు మణిశర్మ.

ఎ.ఆర్.రెహ్మాన్ రెచ్చిపోతున్న రోజులవి. ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి, ఇళయరాజాల స్వరాలకు ప్రేక్షకులు తలలూపడం తగ్గించుకుంటున్న కాలమది. కారణమేంటో తెలీదు కానీ నేరుగా తెలుగు సినిమాలకు రెహ్మాన్ సంగీతం అంతగా అచ్చిరావడంలేదు.

సినీ జనమంతా ఉర్రూతలూగించే సినీ సంగీతపు లోటును అనుభవిస్తున్న సమయంలో 'సమరసింహారెడ్డి' వచ్చింది. ఒంగోలు విజయదుర్గ హాల్లో చూశాను.

గతంలో బాలకృష్ణ సినిమాలకు అద్బుతమైన సంగీతం అందించిన కె.వి.మహదేవన్. చక్రవర్తిల శైలిని ఔపోసన పట్టినట్టున్నారు మణిశర్మ. మరీ ముఖ్యంగా చక్రవర్తిలా చక్రం తిప్సేసారు. ఒక్కోపాట బ్రహ్మాండంగా వచ్చింది.

మట్టి తోలుకువెళ్ళే ట్రాక్టర్ల నుంచి బెంజి కార్ల దాకా ఎక్కడ చూసినా సమర సింహారెడ్డి పాటలే. అలా ఆ ఇద్దరు గొప్ప సంగీత దర్శకుల ఖాళీని భర్తీ చేశారు మణిశర్మ.

ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ గణేష్ సినిమాలో తండ్రి, చెల్లెలుతో కథానాయకుడి పాట, మహేష్ బాబు మురారి సినిమాలో పెళ్ళి ఏర్పాట్ల పాట లాంటివి ఎన్నో ఉన్నాయి. నాకైతే వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమాలో 'నేరేడే పళ్ళు.. నీ నీలాల కళ్ళు' పాట అంటే మరీ మరీ ఇష్టం.

చివరిగా.. తెలుగువారు మా సంగీత దర్శకుడు అని గర్వంగా చెప్పుకునే సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు.

(జులై 11. సంగీత దర్శకుడు మణిశర్మ జన్మదినం)

--- మహేష్ ధూళిపాళ్ళ

7/03/2020

స్పష్టాస్పష్ట ప్రేమకథా చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'


సినిమా వాళ్ళు ఏ భాషకు చెందినవారైన కావొచ్చు ప్రేమ కథలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేపథ్యాలను ఎంచుకొని ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఆ కోవకు చెందినదే అమెజాన్ ప్రయిమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై జులై మూడవ తేదీన విడుదలైన మలయాళ చిత్రం 'సూఫియుమ్ సుజాతయుమ్'.

ఇదొక మాటలు రాని కథక్ నాట్యకారిణి సుజాత (అదితిరావు హైదరీ), సూఫీ (దేవ్ మోహన్) మధ్య నడిచే ప్రేమకథ.

ఈ ప్రేమ కథకు సుజాత భర్త రాజీవ్ (జయసూర్య) ఏ మేరకు స్పందించాడనే కథ పూల దండ మధ్య దారంలా అంతర్లీనంగా సాగుతుంది.

చుట్టూ ఆకుపచ్చని కొండలు, చెప్పులు విప్పి చేత పట్టుకుంటే కానీ మానవమాత్రులకు దాటడం సాధ్యం కాని ఓ నది, పాతకాలపు సూఫీ (ముస్లిం) ప్రార్థనా మందిరం, పక్షులతో కళకళాలాడుతూ ఇప్పుడిప్పుడే పట్టణ శోభను సంతరించుకుంటున్న ఓ పల్లెటూరు చిత్ర కథకు ఓ చక్కని వేదికగా అమరింది.

సుజాత ఓ సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన 22 ఏళ్ళ యువతి. బధిరురాలైనప్పటికి అందరూ చెప్పేవి వినపడుతుంటాయి. చక్కగా నాట్యం చేస్తుంది. పిల్లలకు నాట్య పాఠాలు చెబుతుంటుంది.

తల్లిదండ్రులు ఆమెకు పెళ్ళి సంబంధం చూస్తుంటారు. దుబాయ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే డాక్టర్ రాజీవ్‌తో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి.

సరిగ్గా ఇలాంటప్పుడే ఆ ఊరికి ఓ సూఫీ వస్తాడు. మునివేళ్ళపై నిలుచుండి నాట్యం చేయడం ద్వారా సుజాతను ఆకట్టుకుంటాడు. ఇద్దరూ ఎక్కడి కన్నా పారిపోదామనుకుంటారు. అందుకు గుండెలు బాదుకుంటూ తండ్రి అడ్డు చెప్పడంతో సుజాత ఆగిపోతుంది. సూఫీ కనిపించకుండాపోతాడు.

సూఫీ ఇచ్చిన జపమాల సుజాత దగ్గరే ఉండిపోతుంది. ఆ తర్వాత రాజీవ్‌‌ను వివాహం చేసుకుని దుబాయ్ వెళ్ళిపోతుంది. ఓ కూతుర్ని కంటుంది.

అంతా బాగున్నదని భావిస్తున్న సమయంలో ఊరి నుంచి వచ్చిన ఓ కబురు సుజాత, రాజీవ్‌లను ఉన్నపళంగా ఊరికి చేరుస్తుంది. ఆ తర్వాత జపమాల చుట్టే కథ అంతా తిరుగుతుంది.

ఇంతకన్నా ఎక్కువగా చెబితే సబ్ టైటిల్స్‌తో సినిమా చూడాలనుకునేవారికి చూడాలనే ఆసక్తి చచ్చిపోయే అవకాశం ఉంది.

సినిమా అంతా సన్నాయి(క్లారినేట్) వినపడుతుంటుంది. దానికి తోడుగా అక్కడక్కడా కాసిని ఫిడేలు, గిటారు రాగాలు, తబలా, ఢోలక్ దరువులు ప్రేక్షకులను సినిమా వెంట తీసుకువెళతాయి. ఈ విషయంలో సంగీత దర్శకుడు ఎం జయచంద్రన్‌కు పెద్ద పీట వేయాలి.

రెండు గంటల రెండు నిముషాల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నరనిపుళా షానవాస్.. చిత్రానికి కీలకమైన ప్రేమ సన్నివేశాలను స్పష్టాస్పష్టంగా తీర్చిదిద్దడం వింత గొలుపుతుంది. బహుశా ఈ స్పష్టాస్పష్టత కారణంగానే సినిమాకు 18 ప్లస్ రేటింగ్ ఇచ్చినట్టున్నారు.

సూఫీ ప్రార్థనకు సుజాత చేసే కథక్ నృత్యం రసహృదయులైన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆమె గదిలో గోడకు తగిలించిన ఫ్రేములో బిస్మిల్లా ఖాన్ చిత్రపటం దర్శకుడి అభిరుచికి నిదర్శనం. 

చివరగా.. తెలుగులో వచ్చిన శోభన్ బాబు 'కళ్యాణ తాంబూలం', జగపతి బాబు 'ప్రియరాగాలు', అల్లరి నరేష్ 'ప్రాణం' సినిమా తరహాలో మలయాళ 'సూఫియుమ్ సుజాతయుమ్' సినిమా ఓ  'దృశ్య'కావ్యం మాత్రమే.

--- మహేష్ ధూళిపాళ్ళ