దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుగు వార్తా పత్రికలు, వార పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ఒక పోకడ చూస్తున్నాను. అదేమిటంటే గతంలో విజయవంతమైన చలనచిత్రాల గురించి ప్రత్యేక కథనాలు, సంబంధిత వ్యక్తులతో ప్రత్యేక ముఖాముఖులు.
మొదట్లో ఫలానా సినిమాకు 50 ఏళ్ళతో మొదలై ఇప్పుడు ఫలానా సినిమాకు ఐదేళ్ళకు చేరుకున్నాం. మంచి పరిణామమే. కాదనడానికి లేదు. ఎందుకంటే కాలం ఎవ్వరి కోసం ఆగదు కనుక.
అయితే ఒక విజయవంతమైన సినిమా గురించి ప్రతి ఏడాదీ చెబుతున్నారంటే బహుశా అదే మూసలో మనమూ తీయాలేమో అనే అపోహకు వర్థమాన చలనచిత్రరూపకర్తలు గురయ్యే ప్రమాదం ఉందని నా భావన. "ఆ కాలానికి అది చెల్లింది.. ఇప్పటికీ ఏది చెల్లుతుంది" అనే పరిశీలనకు తావులేకుండా పోతుందని నా అనుమానం. అందుకనే ఈ సందర్భంగా నాదొక విన్నపం.
గతంలో గొప్ప గొప్ప దర్శకులు, నటీనటులు, నిర్మాణ సంస్ధల కలయికలో భారీ అంచనాలతో విడుదలై పరాజయం పొందిన చలనచిత్రాలనూ సినీ విశ్లేషకులు పట్టించుకోవాలి. అవెందుకు జనాదరణ పొందలేకపోయినదీ సమగ్రంగా విశ్లేషించాలి. అలాంటి కథనాలు, ముఖాముఖులు విమర్శనాత్మకంగా ఉంటూనే క్షీర నీర న్యాయాన్ని పాటించాలి. నేటి తరం చలనచిత్ర రూపకర్తలకు పాఠాలుగా ఉండాలి.
అభిమానులు అన్యధా భావించరని భావిస్తూ గతంలో పేరొందిన కథానాయకులు, దర్శకులు, సంగీత దర్శకుల కలయికలో రూపొంది పరాజయం పొందిన కొన్ని చలనచిత్రాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
చిరంజీవి, కోదండరామిరెడ్డి, ఇళయరాజా కలయికలో 'కిరాతకుడు'
బాలకృష్ణ, కె విశ్వనాథ్, కెవి మహదేవన్ కలయికలో 'జననీజన్మభూమి'
నాగార్జున, విబి రాజేంద్రప్రసాద్, చక్రవర్తి కలయికలో 'కెప్టెన్ నాగార్జున'
వెంకటేష్, కె రాఘవేంద్రరావు, మణిశర్మ కలయికలో 'సుభాష్ చంద్రబోస్'
ఇలా చెప్పుకుంటూ పోతే పరాజయం పొందిన చలనచిత్రాలు మనకు చాలానే తటస్థపడతాయి.
కొసమెరుపు: ఇటీవల సినీ రచయిత దివాకర్ బాబు మలయాళం నుంచి పునర్ నిర్మించగా తాను రచించిన 'వజ్రం' చలనచిత్రం పరాజయంపై ఫేస్‌బుక్‌లో సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానించారు. అనేక మంది ఆ చిత్రంపై వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చివరిగా దివాకర్ బాబు తన స్వీయ విశ్లేషణను అందించారు.