రాజకీయ
వర్గాలకు జనసేన అధినేత, ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం
చుక్కాని లేని నావలా నడి సంద్రంలో చిక్కుకుందనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలున్నారు.
పవన్ పాతికేళ్ళ రాజకీయ కసరత్తు మూడు నాళ్ళ ముచ్చటగా మారిపోయిందని ముక్కున
వేలేసుకుంటున్నారు.
చరిష్మా ఉన్నా కానీ చంచలత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఈ
యూత్ ఐకాన్ ను చూసి వీర భక్తులు విస్తుపోతున్నారు.
వరుస సినిమా షూటింగ్ లతో
బిజీబిజీగా ఉన్న పవర్ స్టార్ సరికొత్త విశేషాలను తెలుసుకోవడానికి క్రమక్రమంగా
ట్యూన్ అవుతున్నారు.
ఇక
అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేంద్రంలో కమలదళంతో
దోస్తీకి తహతహలాడుతున్నాయనే కథనాలు వండి వార్చడంలో తెలుగు మీడియా కదన కుతుహలాన్ని
ప్రదర్శిస్తోంది.
పవన్
కళ్యాణ్ మాటల్లో మునుపటి వాడీ వేడీ తగ్గినట్టు కనిపిస్తోంది. జనం కనిపించిన ప్రతి
చోటా వివాదాస్పద రాజధాని, ప్రత్యేక హోదా అంశాల కన్నా కూడా సినిమాల్లో తన రీ
ఎంట్రీని సమర్థించుకోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు జనసేన అధినేత.
బీజేపీతో జట్టు కట్టాక
ఏ అంశంపైన మాట్లాడుతున్నా కానీ ఆ అంశంపై ఒక స్పష్టమైన వైఖరి ఆయన మాటల్లో వినపడ్డం
లేదు సరికదా హావభావాల ప్రదర్శనలో జనసేన అధినేత ధోరణిలో పూర్తి మార్పు వచ్చింది.
ఏ
పూటకాపూట సరికొత్త మలుపులు తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో పొలిటీషియన్ గా తన
అడ్రస్సు, పార్టీ అడ్రస్సు ఎక్కడ గల్లంతవుతుందోననే ఆందోళన పవర్ స్టార్ లో ఒకింత
కనిపిస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే ఏనుగుల్లాంటి పార్టీల మధ్య నలుగుతున్న
కుందేలులా ఉంది జనసేన పార్టీ పరిస్థితి.
చెగువెరాకు కాలం చెల్లింది. ఎర్ర కండువా కనుమరుగైపోయింది. పుస్తెల తాడులా ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే పుస్తకం అదృశ్యమైపోయింది.
కానీ
ఒక్కటి మాత్రం నిజం యువ రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ దాదాపుగా గడచిన పుష్కర కాలంలో
తన ప్రస్థానంలో ఎన్ని యూటర్న్ లు తీసుకున్నా కానీ, రూట్లు మార్చినా కానీ ఇప్పటికీ
ఆయనంటే పడిచచ్చే టీనేజర్లకు ఆంధ్రప్రదేశ్ లో కొదవ లేదు.
పవన్ కళ్యాణ్ ను కాపాడుతున్నది ఆయనకున్న
నిలువెత్తు చరిష్మా.
ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగేళ్ళ
దాకా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. మరి అప్పటిదాకా పవర్ స్టార్ పొలిటికల్ ఫీల్డ్
లో పికప్ అవుతారా లేక సినిమా భాషలో చెప్పాలంటే పర్మనెంట్ గా ప్యాకప్ చెప్తారా
అనేది కాలమే నిర్ణయించాలి.

No comments:
Post a Comment